ముక్కంటి క్షేత్రంలో...
'రాహుకేతువులు' తిష్ట
ఉచిత సేవల పేరుతో ఎంట్రీ ట్రస్టు బోర్డు ఫిర్యాదులూ బేఖాతర్
ఆధ్యాత్మిక క్షేత్రం శ్రీకాళహస్తీశ్వరాలయంలో దళా రుల దందా ఆగేలా లేదు. అధికారపార్టీ సిఫార్సులతో ఉచిత సేవల పేరిట ఆలయంలోకి ఎంట్రీ ఇస్తున్న కొందరు విధులు మాని దళారుల అవతారమెత్తుతున్నారు. శీఘ్ర, అంతరాలయ దర్శనం పేరుతో భక్తులను నిలువు దోపిడీ చేస్తున్నారు. ఉచిత సేవల ముసుగు లో ఆలయ పీఆర్వో కార్యాల యంలో తిష్ట వేసి దందాలకు పాల్పడు తున్నారు. దళారుల దందా కారణంగా ఆలయానికి భారీగా నష్టం వాటిల్లడంతో పాటు చెడ్డ పేరు మూట కట్టుకోవాల్సి వస్తోంది. ఈ విషయంపై ఆలయ ధర్మకర్తల మండలి పలు మార్లు ఆలయ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం.
ప్రజాశక్తి-శ్రీకాళహస్తి
శ్రీకాళహస్తీశ్వరాలయం రాహు-కేతు సర్పదోష నివారణ పూజలకు ఖ్యాతి గాంచింది. ఈ పూజల కోసం దేశ, విదేశాలకు చెందిన భక్తులు నిత్యం వేలాదిగా వస్తుంటారు. రాహు-కేతు పూజల్లో రూ.500. రూ.750, రూ.1,500, రూ.2,500, రూ.5వేలు టికెట్లతో ఇలా ఐదు రకాల రాహు-కేతు సర్పదోష నివారణ పూజలు నిర్వహిస్తారు. ఈ ఐదు రకాలకు సబంధించి రోజుకు సగటున 4వేలు వరకు రాహు-కేతు సర్పదోష నివారణ పూజలు జరగుతాయి. వారాంతాల్లో 5వేలకు పైగా ఈ పూజలు జరుగుతాయి. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులను కొంతమంది దళారులు శీఘ్ర, అంతరాలయ దర్శనం పేరుతో నిలువు దోపిడీ చేస్తున్నారు. శీఘ్ర దర్శనం కోసం ఆలయం వారు రూ.200 టికెట్టు ఖరారు చేశారు. అయితే దళారులు ఈ టికెట్టు కొనుగోలు చేయకుండా భక్తులను అడ్డదారిలో దర్శనానికి తీసుకెళతారు. అలా తీసుకెళ్లినందుకు రూ.500 నుంచి రూ.1,000 వరకు భక్తుల వద్ద గుంజుతారు. ఇక అంతరాలయ దర్శనం పేరుతో రూ.1,000 వరకు వసూలు చేస్తున్నారు. సామాన్య భక్తులకు వివిధ ఆంక్షలు విధించే ఆలయ అధికారులు దళారుల విషయంలో మాత్రం ఏ నిబంధన విధించడం లేదు. దళారులు వచ్చిన వెంటనే వారికి స్వాగతం పలుకుతూ దర్శనానికి అనుమతిస్తున్నారు. కొంతమంది దళారులు వాహనాల పార్కింగ్ ప్రదేశం నుంచే భక్తులతో దర్శనానికి ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. అంతరాలయ దర్శనానికి రూ.1,500 అవుతుందనీ, తమకు రూ.1,000 సరిపోతుందని చెబుతారు. దళారుల మాటలు నమ్మి వారు చెప్పినట్లు డబ్బు ఇచ్చేస్తున్నారు. వాహనాల పార్కింగ్ ప్రదేశంలో ఓ దళారి భక్తులతో ఒప్పందం కుదుర్చుకునే వీడియో ఒకటి ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది.దళారుల అడ్డాగా పిఆర్‌ఒ కార్యాలయం మారిందన్న విమర్శలను మూటగట్టుకుంది. ఉన్నతాధికారులకు 'దక్షిణ' సమర్పించగా వీరి ఆదాయం రోజుకు 5-10వేలు ఉంటుందని అంచనా. పాలకమండలి ఛైర్మన్ అంజూరు శ్రీనివాసులు మాత్రం 'ప్రజాప్రతినిధి నుంచి అనుమతి వస్తే రెండు గంటల్లో దళారులను ఏరిపారేస్తాం' అని ప్రకటించడం గమనార్హం.










