ముక్కంటి ఈఓగా
మళ్లీ భ్రమరాంబ..?
ప్రజాశక్తి - తిరుపతి బ్యూరో
శ్రీకాళహస్తి దేవస్థానం ఈఓగా ఆర్‌జేసి దర్భముళ్ల భ్రమరాంబను దేవాదాయ శాఖ నియమించే అవకాశం ఉందని సమాచారం. విజయవాడ కనకదుర్గ ఆలయ ఈఓగా పనిచేస్తున్న ఆమెను అక్కడి నుంచి ప్రభుత్వం బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమెను శ్రీకాళహస్తీశ్వర ఆలయ ఈఓగా నియమించే అవకాశం ఉందని తెలిసింది. ఇక్కడ ఈఓగా పనిచేస్తున్న ఈఓ సాగర్ బాబుకు, ఆలయ పాలక మండలి మధ్య సఖ్యత లేకపోవడంతోపాటు ఓ ఛిరుద్యోగి చేతిలో ఆలయ పాలన సాగుతోందన్న విమర్శలు వస్తున్నాయి. దీంతో ఈఓ సాగర్ బాబు బదిలీ అవుతారని జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే శ్రీకాళహస్తి ఆలయ ఈవోగా, తిరుపతి ఆర్జెసిగా పనిచేసిన అనుభవంతోపాటు పలు సంస్కరణలు తెచ్చారు. దీంతో ఒకవేళ ఈఓ సాగర్ బాబు బదిలీ అనివార్యం అయితే ఈఓగా భ్రమరాంబ బదిలీ పై రానున్నారని విశ్వసనీయ సమాచారం. ఇదిలా వుంటే ఈఓ భ్రమరాంబ వస్తే ఇప్పటి ఈఓ సాగర్ బాబుతో సఖ్యతగా మెలుగుతూ వున్న ఆ ఛిరుద్యోగి ఆడిందే ఆట,పాడిందే పాట కొనసాగుతుందో లేదో వేచి చూడాల్సిందే మరి.










