ప్రజాశక్తి-మార్టూరు రూరల్: పురాతన కాలం నాటి ఆచారాలను, సంప్రదాయాలను, జీవన విధానాలు అంతరించిపోకుండా భావితరాలకు అందించడానికి శ్రీకారం రోటరీ కళాపరిషత్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 13వ తెలుగు రాష్ట్రాల నాటిక పోటీలు వీక్షకులను ఆలోచింపచేశాయి. మూడు రోజుల పాటు మార్టూరులో నిర్వహించిన జాతీయ స్థాయి నాటికల పోటీలు గురువారం అర్ధరాత్రితో ముగిశాయి. ఈ పోటీల్లో శ్రీ సద్గురు కళానిలయం సమర్పణలో బసవరాజు జయశంకర్ దర్శకత్వంలో మునిపల్లె విద్యాధర్ రచించిన కమనీయం నాటిక ఉత్తమ ప్రదర్శనగా ఎంపికయ్యింది. ద్వితీయ ఉత్తమ ప్రదర్శనగా అరవింద ఆర్ట్స్ తాడేపల్లి సమర్పణలో గంగోత్రి సాయి దర్శకత్వంలో వల్లూరు శివప్రసాద్ రచించిన వెండి అంచులు, తృతీయ ఉత్తమ ప్రదర్శనగా కొండంత అండ నాటికలను న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించిన ప్రొఫెసర్ పివి రామ్ కుమార్, ఆకురాతి మురళీకృష్ణ, కె కాంతారావు ఎంపిక చేశారు.
ఉత్తమ నటులు వీరే..
ఉత్తమ నటుడిగా కొత్తపరిమళం నాటికలో ఇండియన్ ఆర్మీ కెప్టెన్ డాక్టర్ గోపాల్ పాత్రధారి బి శోభన్‌బాబు, ఉత్తమ సహాయ నటులుగా కొండంత అండ నాటికలో భూషి పాత్రధారి చిన ఆదాం, షఫీ, ఉత్తమ క్యారెక్టర్ యాక్టర్‌గా ప్రక్షాళన నాటికలో వెంకట్రావు పాత్రధారి పున్నయ్య చౌదరి ఎంపికయ్యారు. ఉత్తమ నటిగా కమనీయం నాటికలో రామలక్ష్మి పాత్రాదారి జి లహరి, ఉత్తమ హాస్యనటుడుగా రాజ రాజ చోరులు సత్యానందం పాత్రధారి మండవ సోమయ్య, ఉత్తమ విలన్‌గా కొత్తపరిమళం నాటికలో ఉస్మాన్ ఖాన్ పాత్రధారి బి చలంను న్యాయ నిర్ణేతలు ఎంపిక చేశారు.
ఉత్తమ దర్శకుడు..
ఉత్తమ దర్శకుడిగా గంగోత్రి సాయి (వెండి అంచులు నాటిక), ఉత్తమ రచయిత మునిపల్లె విద్యాధర్ (కమనీయం నాటిక) ఎంపికయ్యారు. ప్రత్యేక బహుమతులను ప్రేమతో నాన్న నాటికలో లావణ్య పాత్రాధారి సురభి ప్రభావతి, శవరంజనిలో సింహాచలం పాత్రధారి ఎం రాంబాబు, చేతివ్రాత నాటికలో గోవిందరాజులు పాత్ర పోషించిన పి భద్రేశ్వరరావు, పక్కింటి మొగుడు నాటికలో సీతాపతి పాత్రధారి ఎంవి శేషయ్య, పక్కింటి మొగుడు నాటికలో సీత పాత్రధారి లలితలను న్యాయ నిర్ణేతలు ఎంపిక చేశారు. విజేతలకు శ్రీకారం రోటరీ కన్వీనర్ ఎఫర్ట్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జాష్టి మోహనరావు, శ్రీకారం అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ కందిమళ్ల సాంబశివరావు, జాష్టి అనురాధ, రోటరీ క్లబ్ ఆఫ్ మార్టూరు అధ్యక్ష కార్యదర్శులు కొర్రపాటి కాజారావు కుర్రా వెంకటరామయ్య రోటరీ సభ్యులు బహుమతులను అందజేశారు. ఈ నాటిక పోటీలలో పాల్గొన్న ప్రతి కళాకారుడికి శ్రీకారం-రోటరీ కళాపరిషత్ ఆధ్వర్యంలో నగదు బహుమతి అందించారు. ఈ నాటికల పోటీలను విజయంతం చేసిన కళాకారులు, కళాభిమానులకు శ్రీకారం కన్వీనర్ జాష్టి మోహనరావు అభినందనలు తెలిపారు.










