Oct 19,2023 22:59

ప్రజాశక్తి-ఎడ్యుకేషన్‌: ఇందిరాగాంధీ మున్సిపల్‌ కార్పొఏరేషన్‌ స్టేడియంలో ఐదు రోజుల పాటు జరిగిన 18వ జాతీయస్థాయి జూనియర్‌ సాఫ్ట్‌ టెన్నిస్‌ పోటీలు గురువారం ఘనంగా ముగిశాయి. దేశ వ్యాప్తంగా 23 రాష్ట్రాల నుంచి సుమారు 600కుపైగా క్రీడాకారులు పాల్గొన్న ఈ టోర్నమెంట్‌లో క్రీడాకారులు గెలుపు కోసం విశేషంగా కషి చేశారు. అన్ని విభాగాల్లోనూ తమిళనాడు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌తో పాటు ఇతర రాష్ట్రాల క్రీడాకారులు విశేష ప్రతిభ కనబరిచారు. ముగింపు కార్యక్రమానికి ఎన్‌టిఆర్‌ జిల్లా క్రీడాప్రాధికారసంస్థ (డిఎస్‌ఎ) చీఫ్‌ కోచ్‌ ఎస్‌ఎ అజీజ్‌ ముఖ్య అతిధిగా హాజరై విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అనతికాలంలోనే దేశంలో సాఫ్ట్‌ టెన్నిస్‌ ఎంతో అభివద్ధి చెందిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ సాఫ్ట్‌ టెన్నిస్‌ అసోసియేషన్‌ కషి ఫిలితంగా విజయవాడకు చెందిన ఎన్‌ అనూష ఇటీవల చైనాలో జరిగిన ఆసియా క్రీడలలో సాఫ్ట్‌టెన్నిస్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహించిందన్నారు. జాతీయస్థాయి జూనియర్‌ ఛాంపియన్‌ షిప్‌లోనూ నగర క్రీడాకారిణి ఎం భావన అత్యుత్తమ ప్రతిభను కనబరిచి కాంస్య పతకాన్ని సాధించినట్లు తెలిపారు. ప్రభుత్వం కూడా క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని, పతకాలు సాధించిన వారికి నగదు పురస్కారాలను కూడా అందజేస్తున్నట్లు తెలిపారు. రానున్న రోజులలో విజయవాడలో మరిన్ని జాతీయస్థాయి పోటీలు నిర్వహించేందుకు సాఫ్ట్‌ టెన్నిస్‌ అసోసియేషన్‌ సిద్ధంగా ఉండటం హర్షణీయమన్నారు. ఈ కార్యక్రమంలో సాఫ్ట్‌ టెన్నిస్‌ ఫెడరేషన్‌ కోశాధికారి విజరు సోలంకి, రాష్ట్ర సంఘం చైర్మన్‌ దారం నవీన్‌ కుమార్‌, ప్రధాన కార్యదర్శి డి దిలీప్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.