Aug 17,2023 22:10

ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న వైసిపి సమన్వయకర్త దీపిక, తదితరులు

ప్రజాశక్తి-హిందూపురం : త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అధికార వైసిపి, ప్రతి పక్ష టిడిపిలు హిందూపురం రూరల్‌ మండలం చలవెందుల గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దీంతో గత మూడు రోజుల పాటు హోరాహోరీగా ప్రచారాలు నిర్వహించాయి. దీంతో పాటు ఇరు పార్టీల వారు ఓటర్లను ప్రసన్నం చేసుకోవాడానికి ప్రలోభాల పర్వానికి తెరలేపారు. టిడిపి వారు ు ఓటుకు రూ.1000 ఇస్తే వైసిపి వారు రూ.1000 నుంచి 1500 రూపాయల వరకు ఇవ్వడంతో పాటు చీరలను సైతం పంపిణీచేస్తున్నట్లు వార్తలు వినపిస్తున్నాయి.
హిందూపురం రూరల్‌ మండలం చలివెందుల గ్రామ పంచాయతీ సర్పంచి సౌభాగ్యమ్మ అనారోగ్యంతో గత ఏడాది మృతి చెందారు. దీంతో ఆ పంచాయతీకి ఈ నెల 19న ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల పర్వంలో భాగంగా గురువారంతో ప్రచార పర్వం ముగిసింది. ఈ ఉపఎన్నికకు ఎటువంటి పార్టీ గుర్తులు లేకపోయినప్పటికీ ఇటు అధికార పార్టీ వైసిపి, ప్రతిపక్ష పార్టీ టిడిపి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గత మూడు రోజుల నుంచి హోరాహోరీగా ప్రచారం సాగిస్తూ విజయంపై ఎవరు అంతకు వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఇరు పార్టీల వారు ఓటర్లను ప్రసన్నం చేసుకోవాడానికి అవసరమైన అన్ని ఏర్పాటు చేసుకున్నట్లు సమాచారం. నగదుతో పాటు చీరలను పంపిణీ చేపట్టినట్లు తెలిసింది. గతంలో జరిగిన ఎన్నికల్లో హిందూపురం రూరల్‌ మండలంలో 14 గ్రామ పంచాయతీల్లో వైసిపి 10 చోట్ల జెండా ఎగురవేసింది. టిడిపి 4 పంచాయతీల్లో తక్కువ మెజార్టీతో తన సత్తా చాటుకుంది. అయితే గతంలో ఇన్‌ఛార్జిగా ఉన్న ఎమ్మెల్సీ షేక్‌ మహమ్మద్‌ ఇక్బాల్‌ కాలంలో ఆ ఎన్నికలు జరిగాయి. అయితే పార్టీ అతన్ని తప్పించి దీపికకు ఇన్‌చార్జ్‌ భాధ్యతలను అప్పగించింది. దీంతో దీపిక ఈ ఎన్నికల్లో ఏలాగైన గెలిచి తమ సత్తా ఏంటో చూపించాలని ప్రయత్నం చేస్తున్నారు. దీనికన్నా ముందే ఏకగ్రీవం చేసుకోవాడానికి అధికార పార్టీ వారు టిడిపి అభ్వర్థికి పెద్ద మొత్తంలో ఆశ చూపించినట్లు విశ్వసనీయ సమాచారం. అది కుదరక పోవడంతో ఎన్నికల్లో ఓటర్లను ఏలాగైన ప్రసన్నం చేసుకోవడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలిసింది. అదే విధంగా టిడిపి వారు కంచుకోటలో తమ సత్తా ఏంటో నిరూపించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఇరు పార్టీల నాయకులు పెద్ద ఎత్తున ప్రచారాలు నిర్వహించారు. మొత్తానికి ఎంతో పటిష్టాత్మకంగా సాగనున్న చలివెందుల సర్పంచి ఉప ఎన్నికల్లో పట్టు నిలుపుకోవాలని టిడిపి, పట్టు సాధించాలని వైసిపి తహతలాడుతున్నాయి ఎవరికి విజయం ఎవరికి వరిస్తుందో 19వ తేదీ సాయంత్రం వరకు వేచి చూడాల్సిందే. ఇదిలా ఉండగా సర్పంచి అభ్యర్థి గెలుపు ఓటములపై అంతర్గతంగా భారీ ఎత్తున పందేలు కూడా జరిగినట్లు మండలంలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అధికారులు ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఎన్నికల విధులకు హాజరయ్యే సిబ్బందికి గురువారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
ప్రచారంలోను తగ్గని విబేధాలు
హిందూపురం మండలం చలివెందుల పంచాయతీ ఉప ఎన్నికల్లోనూ అధికార వైసీపీలో వర్గపోరు వీడలేదు. ఎవరికి వారు వర్గాలుగా విడిపోయి వైసీపీ అభ్యర్థి గెలుపు కోసం ప్రచారం చేస్తున్నారు. పార్టీ పెద్దలతో మార్కులు వేయించుకోవడానికే ప్రచారంలో పాల్గొని మమ అనిపిస్తున్నారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గెలుపు మాట దేవుడెరుగు అటెండెన్స్‌ మాత్రం వేద్దాం అన్నట్టుంది వీరి వ్యవహారం. హిందూపురం నియోజకవర్గ వ్యాప్తంగా నాలుగు గ్రూపులను ఏకతాట పైకి తీసుకురావడానికి వైసిపి అధిష్టానం ఎంత ప్రయత్నించినా అది సాధ్యం కావడం లేదు. ఏపీ ఆగ్రోస్‌ చైర్మన్‌ నవీన్‌ నిశ్చల్‌ ఉప ఎన్నిక ప్రచారానికి దూరంగా ఉన్నారు. రామకృష్ణారెడ్డి సోదరి మధుమతి రెడ్డి ప్రచారం చేస్తున్నారు. హిందూపురం వైసీపీ ఇన్‌ఛార్జి దీపికతో కలిసి ప్రచారం చేస్తున్నప్పటికీ ఆంటీముట్టినట్టు వ్యవహరిస్తున్నట్లు ప్రచారం సాగుతుంది. దీపికతో కలిసి మాజీ ఎమ్మెల్యే అబ్దుల్‌ ఘనీ, ముఖ్య నాయకులు కలిసి ప్రచారం చేస్తున్నారు. మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ ఇంద్రజ, వైసిపి యువజన జిల్లా అధ్యక్షులు వాల్మీకి లోకేష్‌ వారికి మద్దతుగా ఉన్నారు. కౌన్సిలర్లు, నాయకులతో కలిసి ప్రచారం నిర్వహించారు. వైసిిపిలో గ్రూపుల కారణంగా సర్పంచి అభ్యర్థి గెలుపు పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.