Mar 11,2023 20:31

eevaram nandayala

ముగిసిన ప్రచార పర్వం
ప్రజాశక్తి - కర్నూలు ప్రతినిధి

    పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 13న పోలింగ్‌ జరగనుంది. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వీటికి సంబంధించిన ప్రచార పర్వం శనివారం సాయంత్రానికి ముగిసింది. పిడిఎఫ్‌, ప్రజాసంఘాలు బలపరిచిన అభ్యర్థులు ప్రచారంలో ముందంజలో దూసుకు వెళ్ళారు. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ పిడిఎఫ్‌ అభ్యర్థి పోతుల నాగరాజు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పిడిఎఫ్‌ అభ్యర్థి కత్తి నరసింహారెడ్డి ప్రచారంలో ముందుకు సాగారు. పోతుల నాగరాజు జిల్లాలోని పలు ప్రాంతాల్లో, పాఠశాలలు, కళాశాలల్లో పర్యటించి సిబ్బందిని ఓట్లు అభ్యర్థించారు. న్యాయవాదులను కూడా కలిసి ఓట్లు అడిగారు. దీంతోపాటు జిల్లా వ్యాప్తంగా ఆయన తరపున ప్రజాసంఘాల నాయకులు ఇంటింటా ప్రచారం ముమ్మరంగా నిర్వహించారు. కత్తి నరసింహారెడ్డి తరఫున పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాఠశాలల్లో ప్రచారం నిర్వహించారు.
గ్యాస్‌ ధర పెంపుపై నిరసనగ్రహం :
వంట గ్యాస్‌ ధర అంతకంతకూ మండుతూ పోతోంది. కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్‌ సుంకం పేరుతో గ్యాస్‌ సిలిండర్‌ ధర పెంచుతూ పోతుండటంతో సామాన్యులపై భారం పడుతూనే ఉంది. గ్యాస్‌ ధర మరో సారి రూ.50 పెంచడంతో మొన్నటి దాకా రూ.1108 ఉన్న గృహ వినియోగానికి వాడే 14.2 కిలోల గ్యాస్‌ సిలిండర్‌ ధర ఏకంగా రూ.1158కి చేరింది. సామాన్యులపై గ్యాస్‌ భారం పెరిగింది. గ్యాస్‌ ధర పెంపుపై జిల్లా వ్యాప్తంగా నిరసనగ్రహం వ్యక్తం అయింది. సిపిఎం ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ప్రజలపై భారాలు మోపడాన్ని ఎండగట్టారు. పలు ప్రాంతాల్లో గ్యాస్‌ సిలిండర్లతో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.
ఎన్నికలకు ఏర్పాట్లు :
పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ స్థానాలతో పాటు ఉమ్మడి కర్నూలు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. నంద్యాల జిల్లా వ్యాప్తంగా 91 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. సోమవారం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. ఈ నెల 16న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
భానుడి ప్రతాపం :
మార్చి మొదటి వారంలోనే భానుడు భగభగమంటున్నాడు. జిల్లాలో వేసవి తీవ్రత ఆరంభమైంది. గత వారం రోజుల నుంచి ఎండ తీవ్రరూపం దాల్చింది. పగటి పూట ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది 3 డిగ్రీల మేర పెరిగింది. మార్చి తొలి వారంలోనే ఇంత తీవ్రంగా ఎండలు కాస్తుంటే రాబోయే రోజుల్లో ముఖ్యంగా ఉగాది నుంచి మే నెలాఖరు వరకు ఎండలు ఎంత భయంకరంగా ఉంటాయోనని జిల్లా వాసులు భయపడుతున్నారు.