సాలూరు:తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్ కార్మికుల రెండోరోజు దీక్షలు కొనసాగాయి. స్థానిక మున్సిపల్ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన దీక్షల్లో శుక్రవారం పురుష కార్మికులు పాల్గొన్నారు. మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి ఎన్‌వై నాయుడు ఆధ్వర్యాన నిర్వహించిన దీక్షల్లో పురుష కార్మికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీలో పని చేస్తున్న కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. గత ఎన్నికల ముందు సిఎం జగన్ మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరిగాయని, చాలీచాలని జీతాలతో కార్మికులు ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పారు. ఆప్కాస్‌లో విలీనం వల్ల కార్మికుల నష్టదాయకమని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ నాయకులు టి.శంకరరావు, టి.రవి, శ్రీనివాస్ పాల్గొన్నారు.
పార్వతీపురంటౌన్ : స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద కార్మికులు తలపెట్టిన రిలేనిరాహారదీక్షలు రెండో రోజు కొనసాగాయి. ఈ దీక్షల్లో మున్సిపల్ కార్మికులు, మేస్త్రీలు, క్లాప్ డ్రైవర్లు పాల్గొన్నారు. దీక్షలనుద్దేశించి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి యమ్మల మన్మధరావు మాట్లాడుతూ, మున్సిపల్ కార్మికులకు ఎన్నికల ముందు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలన్నీ నెలర్చాలని డిమాండ్ చేశారు. మాట తప్పను మడమ తిప్పనన్న సిఎం అధికారంలోకొచ్చి నాలుగున్నరేళ్లయినా మనకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదన్నారు. సమస్యలను పరిష్కరించేంత వరకూ దశల వారీ పోరాటం ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. సిఐటియు కోశాధికారి గొర్లి వెంకటరమణ మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులు న్యాయమైన పోరాటానికి అన్ని వర్గాల అన్ని రాజకీయ పక్షాలు మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు వి.ఇందిర మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, క్రాఫ్ట్ డ్రైవర్ల సమస్యలు పరిష్కారం చేయాలని సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కార్మికులందరిని రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. దీక్షల్లో ఫెడరేషన్ నాయకులు నాగ వంశీ శంకర్రావు, నాగ వంశీ సింహాచలం, సిహెచ్ సింహాచలం, మల్లేష్, బంగారు రవి, మామిడి శ్రీను, సత్తిరాజు, సంతు, ఆటో డ్రైవర్లు అప్పలరాజు ప్రతాప్ విజరు కుమార్ తదితరులు పాల్గొన్నారు.
పాలకొండ : స్థానిక నగరపంచాయతీ కార్యాలయం వద్ద కార్మికులు తలపెట్టిన రిలేనిరాహారదీక్షలు రెండో రోజు కొనసాగాయి. ఈ దీక్షలనుద్దేశించి సిఐటియు జిల్లా అధ్యక్షులు దావాల రమణరావు మాట్లాడారు. కార్యక్రమంలో పలువురు మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు.










