Oct 01,2023 01:03

ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : గుంటూరు, పల్నాడు జిల్లాల్లో శనివారంతో ఖరీఫ్‌ సీజన్‌ ముగిసింది. తొలి మూడునెలల కంటే సెప్టెంబరులో వర్షాలు ఆశాజనకంగా కురిశాయి. కానీ అవసరమైనప్పుడు వర్షాలు కురవకుండా సీజన్‌ ముగింపు దశలో అధిక వర్షాలు కురవడం వల్ల రైతులు అయోమయంలో చిక్కుకున్నారు. పల్నాడు జిల్లాలో 50 శాతం విస్తీర్ణంలోనే ఖరీఫ్‌ సాగవగా గుంటూరు జిల్లాలో దాదాపు 80 శాతం విస్తీర్ణంలో పైర్లేశారు. పల్నాడు జిల్లాలో 5.12 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు వరకు 2.60 లక్షల ఎకరాల్లోనే సాగైంది. ఇంకా 2.52 లక్షల ఎకరాల భూమి ఖాళీగా ఉంది. పల్నాడు జిల్లాలో వరి, పత్తి సాగు గణనీయంగా తగ్గింది. పల్నాడు జిల్లాలో 1.25 లక్షల ఎకరాల్లో వరిసాగు చేయాల్సి ఉండగా ఇప్పటివరకు కేవలం 20 వేల ఎకరాల్లోనే వేశారు. 3.05 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేస్తారని అంచనా కాగా లక్షన్నర ఎకరాల్లోనే సాగైంది. 1.30 లక్షల ఎకరాల్లో మిర్చిసాగు చేయాల్సి ఉండగా 60వేల ఎకరాల్లో సాగైంది. 50 వేల ఎకరాల్లో కందిసాగు చేస్తారని అంచనా వేయగా ఇప్పటి వరకు 24 వేల ఎకరాల్లో వేశారు. మరో ఆరు వేల ఎకరాల్లో ఇతర పంటలు సాగు చేశారు. గతేడాది కంటే ఈ ఏడాది విస్తీర్ణం గణనీయంగా తగ్గింది.
సెప్టెంబరులో విస్తారంగా వర్షాలు కురవడం వల్ల రబీ పంటలకు మేలు జరుగుతుందని భావిస్తున్నారు. ప్రధానంగా జొన్న, మొక్కజొన్న, మినుము, పెసర, జ్యూట్‌, పొద్దుతిరుగుడు, నువ్వులు తదితర పంటలకు ఉపయోగంగా ఉంటుందని చెబుతున్నారు. పల్నాడు జిల్లాలో సెప్టెంబరులో 134.5 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా 197.9 మిల్లీమీటర్లు నమోదైంది. నకరికల్లు, నూజెండ్ల మండలాలు మినహా మిగతా 26 మండలాల్లో సాధారణ వర్షపాతం కంటే ఎక్కువగా నమోదైనట్లు అధికారులు తెలిపారు. మొదటి మూడు నెలలు కనీస వర్షపాతంకు నోచుకోని మాచర్ల, దుర్గి, రెంటచింతల, గురజాల, దాచేపల్లి, మాచవరం, అచ్చంపేట, క్రోసూరు, పెదకూరపాడు మండలాల్లో ఈ నెలలో అధిక వర్షపాతం నమోదైంది.
గుంటూరు జిల్లాలో 3.25 లక్షల ఎకరాలకు గాను 2.35లక్షల ఎకరాల్లోనే పంటలు సాగు చేశారు. ఇంకా 1.90 లక్షల ఎకరాల్లో ఏ పంటలూ వేయ లేదు. 1.65 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయాల్సి ఉండగా 1.35 లక్షల ఎకరాల్లో వరి వేశారు. 70 శాతం మంది రైతులు వెదపద్ధతిలో సాగు చేయగా 30 శాతం మంది నాట్లు పద్దతిలో సాగు చేశారు. జిల్లాలో 77 వేల ఎకరాల్లో పత్తిసాగు చేస్తారని అధికారులు ప్రకటించగా 44 వేల ఎకరాల్లోనే సాగైంది. 45 వేల ఎకరాల్లో మిర్చిసాగు చేయాల్సి ఉండగా 24 వేల ఎకరాల్లోనే సాగు చేశారు. 20 వేల ఎకరాల్లో ఇతర పంటలు వేశారు. రబీ పంటలుగా మినుము, పెసర, శనగ, జొన్న, మొక్కజొన్న సాగుకు అవకాశం ఉందని వ్యవసాయశాఖ జిల్లా అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. గుంటూరు జిల్లాలో జూన్‌, జులై వర్షాలు ఆశాజనకంగా ఉండగా ఆగస్టులో భారీ లోటు ఏర్పడింది. సెప్టెంబరులో 145.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 221.9 మిల్లీ మీటర్లు నమోదైంది. తెనాలి, పెదనందిపాడు మినహా మిగతా అన్ని మండలాల్లో అధిక వర్షం కురిసింది.