ప్రజాశక్తి - ఎంవిపి.కాలనీ : వారం రోజులుగా నగరంలో జరుగుతున్న విశాఖ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ (కళాభారతి) ఉత్సవాలు శుక్రవారంతో ముగిశాయి. ఆఖరి రోజు కాకినాడ బృందం వారిచే అల్లసాని పెద్దన నాటకాన్ని ప్రదర్శించారు. చివరి రోజు కార్యక్రమానికి కనకమహాలక్ష్మి బ్యాంకు చైర్మన్ రఘునాథరావు ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళాభారతి సేవలను మెచ్చుకుని తమ బ్యాంకు ద్వారా తగిన సాయం అందిస్తున్నామన్నారు. ఆంధ్ర కవితా పితామహునిగా పేరుగాంచిన అల్లసాని పెద్దన నాటకం ఎంతో బాగుందని కితాబిచ్చారు. రెండున్నర గంటలపాటు సాగిన ఈ పద్య నాటకాన్ని ప్రతి ఒక్కరూ మెచ్చుకుని పద్యపద్యానికీ కరతాళ ధ్వనులు చేస్తూ అభినందించారు. అనంతరం కార్యదర్శి గుమ్ములూరు రాంబాబు మాట్లాడుతూ ఏడు రోజుల పాటు అన్ని కార్యక్రమాలూ చక్కగా జరిగాయని తెలిపారు. ఉత్సవాల నిర్వహణకు సహకరించిన వారికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో కళాభారతి అధ్యక్షులు ఎంఎస్.రాజు, ట్రస్టీలు బాలకృష్ణ, ప్రసాద్, రామ్‌గోపాల్ తదితరులు పాల్గొన్నారు.










