Jul 28,2023 01:40
సమావేశంలో మాట్లాడుతున్న ఆర్డీఓ జగన్నాథం పార్థసారథి

ప్రజాశక్తి-రేపల్లె: జగనన్న సురక్షా కార్యక్రమం విజయవంతంగా ముగిసిందని ఆర్డీఓ జగన్నాథం పార్థసారథి తెలిపారు. పట్టణంలోని సీతారామ కళ్యాణ మండపంలో గురువారం సురక్షా ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించటం జరిగిందని తెలిపారు. ప్రజా సంక్షేమమే ఆశయంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి సంక్షేమ పాలన చేస్తున్నారని అన్నారు. వాలంటీర్ల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రారంభించి, పౌర సేవలను వారి ఇంటివద్దే అందించినట్లు తెలిపారు. ప్రజలకు అవసరమైన 11 రకాల సర్టిఫికెట్లను ఉచితంగా నమోదు చేసుకుని అందించటం జరిగిందన్నారు. కుల, ఆదాయ, వివాహం, బర్త్‌, డెత్‌, ఫ్యామిలీ మెంబర్‌ సర్టిఫికెట్లతో పాటు, కౌలు రైతుల కార్డులు, నూతన రైస్‌ కార్డులు చేర్పులు, తొలగింపులు, మొదలగు సేవలు అందించటం అభినందనీయం అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతిరోజూ సుమారు 50 వేల సర్టిఫికెట్లు ఇచ్చేవారని, జగనన్న సురక్ష ద్వారా ప్రతి రోజూ సుమారు 3.50 లక్షల సర్టిఫికెట్లు ప్రజలకు అందజేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో సీఎం జగన్మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, పౌరసేవలు దేశానికే ఆదర్శం అన్నారు. కార్యక్రమంలో వైసీపీ పట్టణ అధ్యక్షులు గడ్డం రాధాకృష్ణమూర్తి, మున్సిపల్‌ చైర్మన్‌ కట్టా మంగా, కమిషనర్‌ విజయ సారథి, వైస్‌ చైర్మన్లు విశ్వనాథ గుప్త, ప్రశాంత్‌ కుమార్‌, ప్రజలు పాల్గొన్నారు.