ప్రజాశక్తి-విజయవాడఅర్బన్: నగరంలోని వి.ఆర్. సిద్దార్ద ఇంజనీరింగ్ కళాశాలలో గత వారం రోజులుగా జరుగుతున్న జాతీయ స్థాయి ఆర్చరీ పోటీలు సోమవారంతో ముగిశాయి. సోమవారం సాయంత్రం ముగింపు కార్యక్రమం జరిగింది. ఈసందర్భంగా వివిధ పోటీలలో విజేతలకు టోర్నమెంట్ డైరెక్టర్ డాక్టర్ హెచ్.యల్. జిందల్, కార్యదర్శి చెరుకూరి కృష్ణకుయారి, ఆర్గనైజింగ్ సెక్రటరీ ,చెరుకూరిసత్యనారాయణ, చీఫ్ స్కోరర్ ఆర్.యన్.సింగ్ తదితరులు బహుమతులను, మెడల్స్‌ను అందచేశారు. ఈసందర్భంగా టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ చెరుకూరి సత్యనారాయణ మాట్లాడుతూ యన్‌టిపిసి ఓల్గా మెమోరియల్ 13వ మినీ అండర్ -14, 5వ కిడ్స్ అండర్ -9 జాతీయ స్థాయి ఆర్చరీ పోటీలు నగరంలో విజయంతంగా జరిగాయని తెలిపారు. ఈపోటీలకుగాను దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుండి 400 మంది క్రీడాకారులు పాల్గొన్నారని తెలిపారు. వారికి వసతి, భోజన సౌకర్యాలు కల్పించామని ఈసందర్భంగా టోర్నమెంట్ విజయవంతగా నిర్వహించేందుకు సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.










