Jul 24,2023 00:49
ప్రతిభ చూపిన ప్రధానోపాధ్యాయులకు ప్రశంస పత్రాలు అందజేస్తున్న ఆర్‌జెడి

ప్రజాశక్తి-బాపట్ల: పాఠశాలల నిర్వహణలో ప్రధాన భూమిక నిర్వహించే ప్రధానోపాధ్యాయులు మంచి నాయకత్వ లక్షణాలను అలవర్చు కోవాలని విద్యా శాఖ రీజినల్‌ జాయింట్‌ డైరెక్టర్‌ వీఎస్‌ సుబ్బారావు తెలిపారు. ఆదివారం బాపట్ల విస్తరణ శిక్షణ కేంద్రంలో పాఠశాల విద్యా శాఖ, సమగ్ర శిక్షా (సీమ్యాట్‌) ఆధ్వర్యంలో ప్రాంతీయ స్థాయి ప్రధానోపాధ్యాయులకు నాయకత్వ లక్షణాలపై శిక్షణా కార్యక్రమం ముగింపు సందర్భంగా ఉపాధ్యాయులనుద్దేశించి ప్రసంగించారు. ఉపాధ్యాయులంతా చిత్తశుద్ధితో పనిచేస్తే ఉత్తమ ఫలితాలు ఖచ్చితంగా సాధించవచ్చని చెప్పారు. ఉపాధ్యాయులు క్షేమంగా, సంతోషంతో ఉంటే విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధన అందించగలరన్నారు. మంచి సమాజాన్ని నిర్మించడానికి విద్యార్థి దశ నుంచే చిన్నారుల్లో మార్పు తేవాలని అన్నారు. విద్యారంగంలో సమూల మార్పులను అవగాహన చేసుకొని ముందుకు సాగాలన్నారు. విద్యార్థుల విద్యే భవిష్యత్తుకు పెట్టుబడిగా భావించి నాణ్యమైన, ఉత్తమ విద్యను అందించాలని తెలిపారు. పాఠశాల విద్యార్థులను ప్రపంచ పౌరులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఉపాధ్యాయులు పని చేయాలన్నారు. కార్యక్రమంలో సెంటర్‌ ఇన్‌ఛార్జి వీరభద్రరావు, అకడమిక్‌ మానిటరింగ్‌ అధికారి మోజెస్‌ పాల్గొన్నారు.