ప్రజాశక్తి - అరకులోయ రూరల్:అరకులోయలో సున్నం రాజయ్య నగర్‌లో రెండు రోజులుగా జరుగుతున్న గిరిజన సంఘం ఎనిమిదో రాష్ట్ర మహాసభ శుక్రవారం ఉత్సాహపూరిత వాతావరణంలో ముగిసింది. ఈ రెండు రోజులూ సాగిన నాయకుల ప్రసంగాలు ప్రతినిధుల్లో స్ఫూర్తినింపాయి. ఆదివాసీ అధికార్ రాష్ట్రీయ మంచ్ జాతీయ ఛైర్మన్, మాజీ ఎంపీ మిడియం బాబూరావు, ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గం మాజీ ఎమ్మెల్సీ ఎంవిఎస్.శర్మ తొలిరోజు మహాసభల ప్రతినిధులనుద్దేశించి మాట్లాడుతూ దిశా నిర్దేశం చేశారు. రెండో రోజు ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు బి.ప్రభావతి మాట్లాడుతూ అటవీ హక్కుల చట్టం, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం గిరిజన సంఘం పోరాట ఫలితంగా వచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. నేడు గిరిజన హక్కులు, చట్టాలపై దాడి తీవ్రమైందని అన్నారు. గిరిజన మహిళ అయిన రాష్ట్రపతి ద్రౌపది ముర్మును నూతన పార్లమెంట్ భవనం ప్రారంభానికి ఆహ్వానించకుండా అవమానించడం దారుణమన్నారు. గిరిజన గ్రామాల్లో రక్షిత మంచినీరు నేటికీ లేదన్నారు. దీంతో ఆదివాసీలు అనారోగ్యాల బారిన పడుతున్నారని అన్నారు. రెండో రోజు సభలో అధివాసీ అధికార్ రాష్ట్రీయ మంచ్ జాతీయ ఛైర్మన్ డాక్టర్ మిడియం బాబూరావు, గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు లోతా రామారావు, కిల్లో సురేంద్ర, రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.అప్పలనర్స, ఎపి వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు కె.లోకనాధం, మంతెన సీతారాం, పి.బాలదేవ్, ధర్మాన పడాల్ పాల్గొన్నారు.:
ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం రాష్ట్ర మహాసభ సందర్భంగా మర్రి కామయ్య వేదికగా మూడు రోజులుపాటు నిర్వహించిన ఆదివాసీ సాంస్కృతిక సంబరాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఏజెన్సీ ప్రాంత వాసులే కాకుండా పర్యాటకులూ వీటిని చూసేందుకు వేలాదిగా తరలివచ్చారు. 250 మంది కళాకారులు రాష్ట్ర నలుమూలల నుంచీ తరలివచ్చి తమ ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. ప్రారంభ కార్యక్రమానికి మాజీ ఎంపీ పి.మధు హాజరవగా, ముగింపు కార్యక్రమానికి మిడియం బాబూరావు, తదితరులు హాజరై కళాకారులను, వీక్షకులను ఉద్దేశించి మాట్లాడారు. సాంస్కృతిక ప్రదర్శనల గొప్పతనాన్ని వివరించారు. సంబరాలు చివరి రోజైన గురువారం రాత్రి గిరిజన సంఘం నాయకులు బాబూరావు, సురేంద్ర, పి.అప్పలనర్స, రామారావు, అనంతగిరి జెడ్‌పిటిసి దీసరి గంగరాజు, గసభ సర్పంచ్ వి.సునీత, గిరిజన ఉద్యోగుల సంఘం నాయకులు తిరుపతిరావు, తౌడన్న, గిరిజన సంఘం అల్లూరి జిల్లా కార్యదర్శి పొద్దు బాలదేవ్, ప్రజానాట్యమండలి రాష్ట్ర నాయకులు మంగరాజు తుడుము వాయించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. చొంపి గ్రామానికి చెందిన కళాకారులు మువ్వలా, కుంద ధింసా నృత్యాలతో ఆకట్టుకున్నారు. మారగడ గిరిజన వాయిద్యం, గుమ్మగూడ సంకిడి, రంపచోడవరం పప్పుల నృత్యం, కర్ర కోలాటం, పాటల నృత్యం, పద్మాపురం మోడల్ ధింసా, రామచందర్ విచిత్ర ప్రదర్శన, ఆదివాసీ బాలికల నృత్యం, చొంపి బల్లి నాటకం, సైలోరి చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఆదివాసీ సంస్కృతి సంబరాల కమిటీ చైర్మన్ టి.చిట్టిబాబు, జిల్లా నాయకులు రఘునాథ్, మహేష్, ఎరుకల దొర, ఎం.బాబూరావు, పి.దేముడు, కె.రామారావు, గిరిబాబు, బుజ్జిబాబు, రామన్న, జోషి, సురేష్, మల్లేష్, భగత్‌రామ్, సూర్యనారాయణ, నానిబాబు, మగ్గన్న, హరి పాల్గొన్నారు. సాంస్కృతిక కళా ప్రదర్శన బృందాలను పద్మాపురం గార్డెన్ మేనేజర్ బొంజు బాబు, టిడిపి మండల అధ్యక్షులు శెట్టి బాబూరావు, యుటిఎఫ్ నాయకులు చిట్టిబాబు, మాజీ ఎంపీ డాక్టర్ మిడియం బాబూరావు, తదితరులు అభినందించారు.










