ప్రజాశక్తి- మంగళగిరి రూరల్ :ఎపి ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీలో ఈ నెల 15న ప్రారంభమైన జాతీయస్థాయి ఉద్గమ్ స్పోర్ట్స్ ఫెస్ట్ సంబరాలు సోమవారం సాయంత్రం ఘనంగా ముగిశాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు చెందిన 14 యూనివర్సిటీలు, ఇంజినీరింగ్ కాలేజీల నుంచి సుమారు 700 మంది క్రీడాకారులు పోటీలకు హాజరయ్యారు. విజేతలకు సోమవారం సాయంత్రం ప్రశంసా పత్రాలతో పాటు షీల్డులను ప్రధానం చేశారు. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య మనోజ్ కే అరోరా, ప్రో వైస్ ఛాన్సలర్ ఆచార్య డి.నారాయణరావు, రిజిస్ట్రార్ డాక్టర్ ప్రేమ్ కుమార్, స్పోర్ట్స్ డైరెక్టర్ డాక్టర్ విజయకుమార్‌లు విజేతలకు షీల్డులను ప్రధానం చేశారు.ఈ క్రీడా సంబరాల్లో ఎస్‌ఆర్‌ఎంతో పాటు కెఎల్‌యు , విజ్ఞాన్, పిబి సిదార్ధ, వివిఐటి, విట్ ఏపి, ఆర్‌విఆర్ జెసి, గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలతో పాటు తెలంగాణకు చెందిన పలు కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు. పురుషుల క్రికెట్ పోటీల్లో ఆర్‌విఆర్‌జెసి, ఎపిఎస్‌ఆర్‌ఎంలు ప్రథమ, ద్వితీయ స్థానాలను కైవసం చేసుకున్నాయి. పురుషుల ఫుట్‌బాల్ పోటీల్లో కెఎల్‌యు, ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీల జట్లు విజేతలుకాగా, వాలీబాల్ పోటీల్లో ఎంఐసీ ఇంజినీరింగ్ కాలేజీ, ఎస్‌ఆర్‌ఎంలు మొదటి రెండు స్థానాలను కైవసం చేసుకున్నాయి. అదేవిధంగా మహిళల వాలీబాల్ పోటీల్లో ఎస్‌ఆర్‌ఎఈసీ విన్నర్స్ కాగా, ఎస్‌ఆర్‌ఎం జట్టు రన్నర్స్‌గా నిలిచింది. అథ్లెటిక్స్ పోటీల్లో ఏపీ ఎస్‌ఆర్‌ఎం, కెఎల్‌యు అన్నింటా పోటీ పడ్డాయి. పురుషుల ఫుట్‌బాల్ పోటీల్లో కెఎల్‌యు విద్యార్థులు అద్భుతమైన క్రీడా ప్రతిభను చూపారు. విజేతలకు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య మనోజ్ కుమార్ బహుమతులను అందజేశారు. డీన్ డాక్టర్ విష్ణుపథ్, కమ్యూనికేషన్స్ డైరెక్టర్ పంకజ్ బలేవెరియ పాల్గొన్నారు.










