ప్రజాశక్తి - మంగళగిరి రూరల్ : ఏపీ ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీలో ఈ నెల 22న ప్రారంభమైన 'జాతీయస్థాయి సాంస్కృతిక కళా ఉత్సవం' (కల్చరల్ ఫెస్ట్) సోమవారం సాయంత్రం ముగిసింది. మూడ్రోజులపాటు జరిగిన ఫెస్ట్‌లో విద్యార్థులు, యూనివర్సిటీ ప్రొఫెసర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. సంగీత, నృత్య, కళా వేడుకల్లో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని సందడి చేశారు. 22న ఉదయం 9.30 గంటలకు యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ మనోజ్ కుమార్ అరోరా, ప్రో వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డి.నారాయణరావు, రిజిస్ట్రార్ డాక్టర్ ఆర్.ప్రేమ్‌కుమార్ జ్యోతి ప్రజ్వలన చేసి ఫెస్ట్‌ను ప్రారంభించారు. అనంతరం విద్యార్థులకు సింగింగ్, డ్యాన్స్, ఫొటోగ్రఫీ, స్టోరీ రైటింగ్, షార్ట్‌ఫిల్మ్ పోటీలను నిర్వహించారు. విజేతలకు వీసి ప్రొఫెసర్ మనోజ్‌కుమార్ అరోరా బహుమతులు ప్రదానం చేశారు.
కేరింతలతో హోరెత్తిన అర్మాన్ మాలిక్ స్టేజి షో
కల్చరల్ ఫెస్ట్‌లో భాగంగా ఆదివారం రాత్రి వర్సిటీ ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రఖ్యాత పాప్ సింగర్ అర్మాన్ మాలిక్ స్టేజి షో విద్యార్థుల కేరింతలతో హోరెగ్తించింది. తెలుగు, హిందీ భాషల్లో ఆయన దాదాపు గంటన్నరపాటు పాడిన సినీ పాటలు విద్యార్థులను ఉర్రూతలూగించాయి.










