Apr 23,2023 22:51

ప్రజాశక్తి - విజయవాడ రూరల్‌ : విజయవాడలోని పిబి సిద్ధార్థ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజీ ఎన్‌ఎస్‌ఎస్‌ యూనిట్‌ ఆధ్వ్యంలో విజయవాడ రూరల్‌ మండలం పాతపాడులో ఏడు రోజులపాటు జరిగిన ప్రత్యేక శిబిరం ఆదివారం ముగిసింది. ఈ సందర్భంగా పంచాయతీ కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ ఎం రమేష్‌ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొని గ్రామీణ ప్రజల సమస్యలను తెలుసుకోవాలన్నారు. అలాగే ఆ సమస్యల పరిష్కారానికి కషి చేయాలని సూచించారు. సామాజిక సేవా శిబిరాలు సమాజ స్వభావం, ప్రజల జీవనోపాధి గురించి బోధిస్తాయన్నారు. 7 రోజుల ప్రత్యేక శిబిరంలో తమ కళాశాల విద్యార్థులు వైద్య శిబిరాన్ని నిర్వహించడమే కాకుండా పలు అవగాహన శిబిరాలను నిర్వహించారన్నారు. క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్లు పాల్గొన్నారని తెలిపారు. ఈ శిబిరాలు భవిష్యత్తులో విద్యార్థులకు ఉపయోగపడ తాయన్నారు. ఈ కార్యక్రమంలో పీబీ సిద్ధార్థ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల డైరెక్టర్‌ వేమూరి బాబురావు, ఎన్‌ఎస్‌ఎస్‌ యూనిట్ల కోఆర్డినేటర్లు పెదపూడి సుభాకర్‌, దేవిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.