
ప్రజాశక్తి-గుంటూరు : గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో మొదటిసారిగా నిర్వహించిన డిఆర్‌ఎం కప్ క్రీడా పోటీలు ఆదివారం ముగిశాయి. స్థానిక నల్లపాడులోని రైల్వే మైదానంలో నిర్వహించిన ముగింపు కార్యక్రమంలో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. చివరి రోజు నిర్వహించిన క్రికెట్ ఫైనల్ మ్యాచ్‌లో డిఆర్‌ఎం జట్టు, పల్నాడు పోలీసు జట్టు తలపడగా డిఆర్‌ఎం జట్టు విజయం సాధించింది. ముగింపు కార్యక్రమంలో డిఆర్‌ఎం రామకృష్ణ మాట్లాడుతూ ఆటల్లో పాల్గొనటం పరస్పర అనుబంధాన్ని మెరుగుపరచటమే కాకుండా, నాయకత్వ లక్షణాలు, వ్యక్తిత్వ వికాసం, సంస్థాగత నైపుణ్యాలను కూడా మెరుగుపరుస్తుందని చెప్పారు. సెంట్రల్ జిఎస్‌టి కమిషనర్ సాధు నరసింహారెడ్డి మాట్లాడుతూ అధికారులు, ఉద్యోగుల ఆరోగ్యం, వ్యక్తిత్వ వికాసానికి సహాయపడే ఇటువంటి క్రీడలను రైల్వే నిర్వహించటం అభినందనీయమన్నారు. అనంతరం క్రికెట్, షటిల్ బ్యాడ్మింటన్ డబుల్స్, వాలీబాల్ పోటీల్లో విజేతలకు బహుమతులు అందచేశారు. కార్యక్రమంలో మహిళా సంక్షేమ అధ్యక్షులు ఆశాలత, ఎడిఆర్‌ఎం కె.సైమన్, సీనియర్ డిసిఎం ఓం.దినేష్‌కుమార్, సీనియర్ డిఎస్‌టిఇ బి.లక్ష్మణ్ పాల్గొన్నారు.