Nov 16,2023 20:23

అయ్యప్ప స్వామి సన్నిధిలో భక్తులు

ప్రజాశక్తి-ఆదోనిరూరల్‌
పట్టణానికి చెందిన 8మంది అయ్యప్ప మాలధారులు గతనెల 17న పట్టణం నుంచి శబరిమలకు చేపట్టిన పాదయాత్ర ఈనెల 16న దిగ్విజయంగా ముగిసినట్లు గురుస్వామి శ్రీనివాస్‌ ఆచారి తెలిపారు. గురువారం ఆయన ఫోన్‌ ద్వారా మాట్లాడారు. గత కొన్ని ఏళ్లుగా పాదయాత్ర చేస్తున్నామని, సుమారు నెలపాటు వెయ్యి కిలోమీటర్ల వరకు పాదయాత్ర కొనసాగిందని తెలిపారు. 30 రోజులు నడక మార్గంలో ప్రయాణించి శబరిమల కొండలు చేరుకున్నామని చెప్పారు. ప్రతేడాది కార్తీక మాసం శబరిమలలో అయ్యప్పను దర్శించుకుంటామని తెలిపారు. మార్గమధ్యంలో ఎక్కడ చీకటైతే అక్కడ ఉన్న దేవాలయాన్ని ఎంచుకుని రాత్రి సేదదీరుతామని చెప్పారు. పాదయాత్ర వెంట తమకు అవసరమైన సరుకులు తీసుకెళ్తామన్నారు. వంట చేసుకునే వెసలుబాటు లేకపోతే స్వాముల కోసం ప్రత్యేకమైన భోజనం అందజేసే హోటళ్లలో భిక్ష చేసినట్లు తెలిపారు. స్వాములు ప్రహ్లాద, వెంకటేష్‌, దాస్‌, మునిస్వామి, విజరు, సోము, కిషోర్‌, బద్రి ఉన్నారు.