ముగిసిన అంతర్జాతీయ సదస్సు
ప్రజాశక్తి-కావలి : పి.బి.ఆర్. విశ్వోదయ ఇంజనీరింగ్ కాలేజ్‌లోని ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ విభాగంలో ''కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్‌లో ప్రస్తుత పురోగతి'' అనే అంశంపై నిర్వహించిన అంతర్జాతీయ సదస్సు శనివారంతో ముగిసింది. వివిధ దేశాలు, మన దేశంలో వివిధ రాష్ట్రాల నుంచి పరిశోధకులు సమర్పించిన పత్రాలను పై క్షుణ్ణంగా చర్చ నిర్వహించారు. దాదాపు వందకు పైగా పరిశోధకులు ఆన్‌లైన్, అఫ్‌లైన్‌లో పాల్గొని తమ పరిశోధన ఫలితాలను ప్రదర్శించారు. ముఖ్య అతిథిగా ఐఐటి తిరుపతి నుంచి విచ్చేసిన డాక్టర్ విక్రమ్‌కుమార్ పూడి 5జీ టెక్నాలజీ ఆవిర్భావం వల్ల ప్రయోజనాలు, జీవన విధానంపై 5జీ ప్రభావాన్ని వివరించారు. విక్రమ్ మాట్లాడుతూ రాబోవు రోజుల్లో డ్రైవర్ లేని వాహనాలతో రోడ్డు ప్రమాదాలు లేని సమాజాన్ని నిర్మించవచ్చన్నారు. ముఖ్య వక్తగా వెల్లూరు ఇన్‌స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ నుంచి విచ్చేసిన డాక్టర్ విజేంద్రబాబు ప్రపంచాన్ని కుగ్రామంగా మార్చేసిన టెక్నాలజీతో తనంతట తానే పనిచేసే తెలివైన ఐఒటి విధానాలు ప్రజా జీవనాన్ని సుఖవంతంగా మార్చనున్నటు తెలిపారు. అధ్యాపకులు, పారిశ్రామిక వేత్తలను ఒకే వేదికపై అనుసంధానం చేయడానికి ఇటువంటి అంతర్జాతీయ సదస్సులు ఎంతగానో ఉపాయుక్తంగా ఉంటాయని విభాగధిపతి డాక్టర్ స్రవంతి తెలిపారు. ఈసిఈ విభాగ అధ్యాపకులు, నిర్వాహకులను అధ్యక్షత వహించిన ప్రిన్సిపాల్ డాక్టర్ భాగవతుల దత్తాత్రయ శర్మ అభినందించారు. కార్యక్రమంలో కో - కన్వీనర్లు డాక్టర్ హయాత్ రజ్వి, డాక్టర్ వెంకటేషన్, వైస్ ప్రిన్సిపాల్స్ శ్రీనాధ్ రెడ్డి, సునీల్ పాల్గొన్నారు.










