Mar 11,2023 22:52

ప్రజాశక్తి-పెనుగంచిప్రోలు 

స్థానిక శ్రీ తిరుపతమ్మ అమ్మవారి చిన్న తిరునాళ్ళు ఉత్సవాల్లో భాగంగా ఐదవ రోజు శనివారం భక్తులు బోనాలు సమర్పణతో ఉత్సవాలు ముగిసాయి. ఈనెల 7వ తేదీన ప్రారంభమైన అమ్మవారి ఉత్సవాలు ఐదు రోజుల పాటు ఘనంగా జరిగాయి. ఉత్సవాలు ప్రశాంతంగా ముగియడంతో వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు ఊపిరి పీల్చుకున్నారు. ఉత్సవాల్లో ప్రథాన ఘట్టమైన శ్రీ తిరుపతమ్మ అమ్మవారి పుట్టింటి పసుపు కుంకుమ మహౌత్సవం సమర్పణ, దివ్య ప్రభోభో త్సవం కార్యక్రమాలను ఆలయ, పోలీస్‌,రెవెన్యూ అధికారులు తో పాటు వివిధ శాఖల అధికారులు విజయవంతం చేయడంలో ప్రథాన పాత్ర పోషించారు. అలాగే ఎంపీడీవో, సర్పంచ్‌, పంచాయతీ కార్యదర్శి ల ఆధ్వర్యంలో శానిటేషన్‌ పనులు ముమ్మరంగా నిర్వహించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆద్వర్యంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వైద్య సేవలు అందించారు. అగ్నిమాపక సిబ్బంది ఐదు రోజుల పాటు ఆలయం వద్ద వుండి సేవలు అందించారు. ఉభయ తెలుగు రాష్ట్రాలు నుండి లక్షలాదిమంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కు బడులు తీర్చుకున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాలు ఆర్టీసీ వారు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి భక్తులకు ఇక్కట్లు లేకుండా చర్యలు చేపట్టారు. చివరి రోజు కూడా భక్తులు పాళ్ళ పొంగళ్ళు నిర్వహించి అమ్మవారికి సమర్పించి పూజలు నిర్వహించారు. ఈ ఉత్సవాలను విజయవంతం చేసిన పలువురు అధికారులకు, ప్రజా ప్రతినిధులు, గ్రామ ప్రజలకు ఆలయ కార్యనిర్వహణాధికారి లీలా కుమార్‌ చైర్మన్‌ చెన్న కేశవ రావు ధర్మకర్తలు లు ప్రత్యేక కతజ్ఞతలు తెలిపారు. కాగా శనివారం ఆలయం వద్ద వివిధ రకాల దుకాణాలకు నిర్వహించిన బహిరంగ వేలం పాటలు ద్వారా 12,75,850 రూపాయల ఆదాయం వచ్చిందని ఆలయ అధికారులు తెలిపారు.