Sep 15,2023 23:08

ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి: పల్నాడు జిల్లాలో ఈఏడాది రైతులకు అడుగడుగునా సమస్యలు ఎదురవుతున్నాయి. జూన్‌, జులై, ఆగస్టు నెలల్లో చాలీచాలని వర్షాలతో సేద్యం ముందుకు సాగలేదు. సెప్టెంబరులో కొంత మేరకు భారీ వర్షాలు కురిసినా భవిష్యత్తులో సాగర్‌ కాల్వలకు నీరురాకపోతే ఏం చేయాలనే అంశంపై రైతులు డోలాయనంలో ఉన్నారు. ఖరీఫ్‌ సీజన్‌ దాదాపుగా ముగింపు దశకు చేరుకుంది. మరో 10 రోజుల్లో రబీ ప్రారంభం కానుంది. ఈ దశలో ఖరీఫ్‌ సాగుఈ ఏడాది పూర్తి నిరాశజనకంగా ఉంది.
పల్నాడు జిల్లాలో 5.12 లక్షల ఎకరాల్లో పంటలుసాగు చేయాల్సి ఉండగా శుక్రవారం వరకు 2.12 లక్షల ఎకరాల్లోనే సాగు జరిగింది. ఇంకా మూడు లక్షల ఎకరాల భూమి ఖాళీగా ఉంది. గుంటూరు జిల్లాలో 3.25 లక్షల ఎకరాల భూమికి 2.20 లక్షల ఎకరాల్లోనే సాగు జరిగింది. దాదాపు లక్ష ఎకరాల్లో ఏ పంటలూ వేయలేదు. సాగర్‌ ఆయకట్టులో ఇప్పటికే వరికి నీరు ఇవ్వలేమని మంత్రి అంబటి రాంబాబు ప్రకటించారు. ఆరుతడి పంటలు వేసుకోవాలని సూచించినా ఇందుకు సంబంధించిన ప్రత్యామ్నాయ ప్రణాళిక ప్రకటించలేకపోయారు. అయితే మాగాణి భూముల్లో వరి తప్ప ఇతర పంటలు వేసే అవకాశం లేదని రైతులు వాపోతున్నారు.
సాగర్‌ ఆయకట్టు పరిధిలో గుంటూరు, పల్నాడు జిల్లాల్లో 1.25 లక్షల ఎకరాల్లో వరి సాగు అవుతుందని అంచనా ఉండగా ఇప్పటివరకు కేవలం 12 వేల ఎకరాల్లోనే వరి సాగు జరిగింది. గుంటూరు, బాపట్ల జిల్లాల్లో కూడా కుడికాలువ కింద కొంత ఆయకట్టు ఉంది. కాల్వలకు నీరు వచ్చే అవకాశాన్ని బట్టి 40 వేల ఎకరాల్లో వరిసాగు చేయాల్సి ఉన్నా కాల్వలకు నీరు లేకపోవడం వల్ల ఇంతవరకు వరి సాగు చేయలేకపోయారు. సాగర్‌ ఆయకట్టుపరిధిలో ఈ పరిస్థితుల్లో ఖరీఫ్‌లో ఏ పంటలు వేయాలి? వేసిన పంటలకు అక్టోబరు, నవంబరులో తుపాన్లు వస్తే పంటల పరిస్థితి ఏమిటని రైతులు మధన పడుతున్నారు.
వరి కాకుండా వాణిజ్య పంటలు విస్తారంగా సాగు చేసే సాగర్‌ ఆయకట్టులోనే ఈ ఏడాది మిర్చి సాగు కూడా సంక్షోభంలో చిక్కుకుంది. ఏటా రెండు లక్షల ఎకరాల్లో మిర్చి సాగవుతుంది. ఈ ఏడాది ఇప్పటివరకు 70 వేల ఎకరాల్లోనే సాగుచేశారు. నవంబరు తరువాత మిర్చికి తప్పని సరిగా రెండు మూడు తడులకు నీటి అవసరం ఉంది. సాగర్‌ నుంచి నీరురాకపోతే మిర్చి దిగుబడి తగ్గే ప్రమాదం ఉంది. గుంటూరు, పల్నాడు జిల్లాల్లో 4.80 లక్షల ఎకరాల్లో పత్తిసాగు చేయాల్సి ఉండగా ఇప్పటివరకు కేవలం 1.80 లక్షల ఎకరాల్లోనే పత్తిసాగు జరిగింది. పల్నాడు జిల్లాలో 50 వేల ఎకరాల్లో కందిసాగు చేయాల్సి ఉండగా వర్షాభావంతో కేవలం 8500 ఎకరాల్లోనే సాగు చేశారు. వర్షాభావం ప్రభావంతో రెండు జిల్లాల పరిధిలో ఈ ఏడాది మందగమనంగా ప్రారంభం అయిన సాగు ఖరీఫ్‌ సీజన్‌ ముగింపు దశలో కూడా మొత్తం విస్తీర్ణంలో పల్నాడు జిల్లాలో 40 శాతం, గుంటూరు జిల్లాలో 70 శాతం మాత్రమే సాగు కావడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది.