May 02,2023 23:53

వివరాలను వెల్లడిస్తున్న పోలీసు అధికారులు

మరో ఇద్దరు పరారీ
ప్రజాశక్తి- జి. మాడుగుల :
మండల పరిధిలో మావోయిస్టులుగా చలామణి అవుతూ, కాంట్రాక్టర్లు, గ్రామపెద్దలను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న ఐదుగురు వ్యక్తులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. వీరిలో ముగ్గురిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు పంపగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. మీడియా సమావేశంలో పోలీసు అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ ఏడాది మార్చి 20న కోరుకొండ దగ్గరలో ఎర్రగొప్ప వద్ద డబ్బుల కోసం కాంట్రాక్టర్‌ను డిమాండ్‌ చేయగా, అతను స్పందించకపోవడంతో జెసిబిని డీజిల్‌, వరిగడ్డి వేసి కాల్చేసిన ఘటనలో నిందితులైన ఐదుగురు నకిలీ మావోయిస్టులు, అలగాం బ్రిడ్జి కాంట్రాక్టర్‌ను బెదిరించి రూ.30లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. లువ్వాసింగి, కుడుముసార, తమ్మింగుల సర్పంచుల ద్వారా గతనెల 21న కాంట్రాక్టర్‌ను కొండపైకి పిలిపించి, నెలాఖరులోగా డబ్బులు ఇవ్వకుంటే చంపేస్తామని, మిషనరీని దగ్ధం చేస్తామని కాంట్రాక్టర్‌ను హెచ్చరించారు. దీంతో భయపడిన సంబంధిత కాంట్రాక్టర్‌ గతనెల 30న ప్రాణభయంతో లువ్వాసింగి సర్పంచ్‌ ద్వారా రూ.ఐదు లక్షలు ఇవ్వజూపగా, వారు నిరాకరించమే కాక ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో తనను చంపేయమేకాక,. మిషన్లును కాల్చేస్తారనే భయంతో సంబంధిత కాంట్రాక్టర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఐదుగురు నకిలీ మావోయిస్టులపై కేసు నమోదు చేసిన పోలీసులు, కాంట్రాక్టర్‌ సమాచారం మేరకు ఆదివారం సాయంత్రం జి. మాడుగుల సిఐ, ఎస్‌ఐ ఆధ్వర్యంలో అలగం బ్రిడ్జి వద్ద మాటువేసి, ఐదుగురు వ్యక్తుల్లో ముగ్గురిని పట్టుకున్నారు. మిగిలిన ఇద్దరు పరారయ్యారు. పోలీసులకు పట్టుబడిన జి.మాడుగుల మండలం రొయ్యలగెడ్డ గ్రామానికి చెందిన గెమ్మలి సత్తిబాబు, కిల్లంకోట పంచాయతీ చీడిమెట్ట గ్రామానికి చెందిన ఆర్‌ఎంపి వైద్యుడు ములజింగి చిన్నారావు, చీడిమెట్ట గ్రామానికే చెందిన డ్రైవర్‌ కిల్లో ఏప్రలను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసుల వెల్లడించారు. పరారైన ఇద్దరి కోసం ముమ్మర గాలింపు చేస్తున్నట్లు వెల్లడించారు. పట్టుబడిన నిందితుల నుంచి మూడు మ్యాన్‌ప్యాక్స్‌, రెండు ఎయిర్‌ పిస్టల్స్‌, మూడు ఎస్‌బిబిఎల్‌ తుపాకులు, మూడు మొబైల్‌ ఫోన్లు, రూ.45వేలు నగదు,మూడు ఆలివ్‌ గ్రీన్‌ డ్రెస్సులు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.