- బంగారు ఆభరణాలు స్వాధీనం
ప్రజాశక్తి - పెద్దాపురం
గత కొంతకాలంగా ఒంటరిగా ఉన్న మహిళల మెడలో బంగారు ఆభరణాలు దొంగిలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద నుండి రూ .ఎనిమిది లక్షల విలువచేసే 151 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు పెద్దాపురం డి.ఎస్.పి లతా కుమారి తెలిపారు. మంగళవారం పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె నిందితుల వివరాలు తెలిపారు. కిర్లంపూడి మండలం బూరుగుపూడికి చెందిన పట్టా వరప్రసాద్, పాఠంశెట్టి హరిబాబులు స్నేహితులని, వీరు బెట్టింగులకు, జల్సాలకు అలవాటు పడ్డారన్నారు. వీరికి జగ్గంపేట మద్యం షాపులో పెద్దాపురం మండలం తూర్పుపాకల గ్రామానికి చెందిన కొరిమెర్ల సతీష్ పరిచయం అయ్యాడన్నారు. ముగ్గురూ బెట్టింగులు, జల్సాలకు అలవాటు పడి చోరీలకు పాల్పడుతున్నారన్నారు. గత ఏడాది ఏప్రిల్ 22న పెద్దాపురం సత్తిరెడ్డి పేటలో ముగ్గురూ మోటార్ బైక్‌పై వెళ్లి ఒంటరిగా ఉన్న మహిళ మెడలో చైన్ దొంగిలించారన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో నువ్వుల గుంట వీధిలో ఒంటరిగా ఉన్న మహిళ మెడలో మోటార్ బైక్‌పై వచ్చి బంగారు గొలుసు దొంగిలించారన్నారు. బాధితుల ఫిర్యాదుల నేపథ్యంలో సిఐ షేక్ అబ్దుల్ నబీ, వి.సురేష్‌ల ఆధ్వర్యంలో ముమ్ముర దర్యాప్తు ప్రారంభించారన్నారు. ఈ దర్యాప్తులో భాగంగా ఈ నెల 15వ తేదీన సీఐ, స్‌ఐ లు పాండవుల మెట్ట వద్ద నిఘావేసి బంగారు ఆభరణాలు కాకినాడలో అమ్ముకునేందుకు మోటార్ బైక్‌పై వెళుతున్న ముగ్గురిని అరెస్టు చేశారన్నారు. వీరు గతంలో కాకినాడ, జగ్గంపేట, గండేపల్లి, రాజమండ్రి ప్రాంతాలలో కూడా దొంగతనాలు చేశారన్నారు. ఈ కేసు దర్యాప్తులో విశేష కృషి చేసిన సీఐ అబ్దుల్ నబీ,ఎస్‌ఐ సురేష్, సిసిఎస్ ఎస్‌ఐ విజరు కుమార్, హెచ్‌సిలు బలరాం, రాధాకృష్ణ, నాగరాజు, పీసీలు సూర్యచంద్ర, నాగేంద్రలను ఆమె అభినందించారు.
సమావేశంలో మాట్లాడుతున్న డిఎస్‌పి లతాకుమారి










