ప్రజాశక్తి-పిడుగురాళ్ల : ముగ్గు మిల్లు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు మండల కార్యదర్శి టి.శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు స్థానిక సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద గురువారం నిర్వహించిన సమావేశానికి ఎన్.యలమంద అధ్యక్షత వహించారు. శ్రీనివాసరావు మాట్లాడుతూ కార్మికులు ఏళ్ల తరబడి పనిచేస్తున్నా సరైన వేతనాలు లేవని, వాటిని పెరిగిన ధరలకు అనుగుణంగా పెంచాలని కోరారు. చట్టపరమైన సౌకర్యాలు అమలు కావట్లేదని, తాగునీరు, విశ్రాంతి గదులు, మరుగుదొడ్లు సదుపాయాలను యాజమాన్యం కల్పించాలన్నారు. ఎండ వానల్లోనూ చెట్ల కిందే కార్మికులు విశ్రాంతి తీసుకోవాల్సి వస్తోందని, మహిళా కార్మికులు బహిర్భూమికి వెళ్లడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వెలిబుచ్చారు. తాగునీటి సదుపాయమూ యాజమాన్యం కల్పించడం లేదన్నారు. ఈ సమస్యలపై కార్మిక శాఖ తనిఖీలు చేయాలన్నారు. రెండేళ్లకోసారి జరిగే కూలిరేట్ల ఒప్పందం ముగియనున్న నేపథ్యంలో కూలిరేట్ల పెంపుదలకు యాజ మాన్యాలు ముందకు రావాలని కోరారు. సమావేశంలో యూనియన్ అధ్యక్షులు జయరాజు, కార్మికులు ఎన్.నాగేశ్వరరావు, పేరయ్య, నరసింహారావు, మురళి, షేక్ ఖాసిం, ఎ.వెంకటేశ్వర్లు, ఎన్.శ్రీను పాల్గొన్నారు.










