అకాల వర్షాలతో తడిసి ముద్దయిన గడ్డి
జాగ్రత్త చేసుకునే అవకాశం దక్కని రైతులు
రెండు జిల్లాల్లో తొమ్మిది లక్షలకుపైగా గేదెలు, ఆవులు
ప్రతిరోజూ లక్షా 50 వేల లీటర్లకుపైగా పాల ఉత్పత్తి
ఎండుగడ్డి కొరతతో పశుపోషణపై రైతులకు అగమ్యగోచరం
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి
అకాల వర్షాలు అన్నదాతను అన్నిరకాలుగా ఇబ్బందులకు గురిచేశాయి. ఇప్పటికే ఆరుగాలం కష్టపడి పండించిన రబీ పంట తడిచి ముద్దవ్వడంతో అన్నదాత కష్టాలు వర్ణనాతీతం. వర్షాలకు యంత్రాలతో కోత అనంతరం పొలాల్లో ఉన్న ఎండుగడ్డి మొత్తం తడిసి ముద్దవ్వడంతో రైతులకు ఏంచేయాలో పాలుపోని పరిస్థితి నెలకొంది. రెండు జిల్లాల్లో తొమ్మిది లక్షలకుపైగా పశువులు ఉన్నాయి. వీటిలో ఏలూరు జిల్లాలో గేదెలు నాలుగు లక్షలు, ఆవులు రెండు లక్షల వరకూ ఉండగా, పశ్చిమలో మూడు లక్షల వరకూ గేదెలు, ఆవులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రతిరోజూ ఏలూరు జిల్లాలో లక్షా 15 వేల లీటర్ల వరకూ పాల ఉత్పత్తి జరుగుతుండగా, పశ్చిమలో 50 వేల లీటర్లకుపైగా పాల ఉత్పత్తి జరుగుతున్న పరిస్థితి ఉంది. వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోవడంతో పాల ఉత్పత్తితోనే రైతుల జీవనం ముందుకు సాగుతోంది. తవుడు, చిట్టు వంటి దాణా ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. ఆక్వా చెరువులు పెరిగిపోవడంతో పచ్చిగడ్డి సైతం తీవ్ర ఇబ్బందిగా మారింది. రైతులు అత్యధికంగా ఎండుగడ్డిని పశువులకు ఉపయోగిస్తారు. గతంలో కూలీలతో కోతలు, నూర్పిళ్లు చేసినప్పుడు జిల్లాలో ఎండుగడ్డికి కొరత ఉండేది కాదు. జిల్లాలో ఖరీఫ్, రబీల్లో దాదాపు పది లక్షల ఎకరాల్లో వరిసాగు సాగుతోంది. దీంతో ఎండుగడ్డికి రైతులకు ఇబ్బంది అనేది పెద్దగా లేకుండా లేని పరిస్థితి ఉండేది. మిషన్ కోతలు వచ్చిన తర్వాత ఎండుగడ్డి కొరత వేధిస్తున్న పరిస్థితి సాగుతోంది. దీంతో యంత్రాలతో కోత కోసిన తర్వాత పొలంలో పడి ఉన్న గడ్డిని జాగ్రత్త చేసి రైతులు పశువులకు వినియోగిస్తున్నారు. ఖరీఫ్‌లోనూ వర్షాలతో ఎండుగడ్డిని రైతులు పెద్దగా జాగ్రత్త చేసుకోలేని పరిస్థితి ఉంది. ప్రస్తుత రబీలో అకాల వర్షాలు విరుచుకుపడటంతో మిషన్ కోత కోసిన తర్వాత పొలాల్లో ఉన్న గడ్డి తడిచిముద్దయిపోయింది. వర్షాలకు నేలకొరిగిన పొలాల్లో గడ్డి పని చేయని దుస్థితి నెలకొంది. ప్రతియేటా రెండు, మూడు పశువులు ఉన్న రైతులు రెండు ట్రాక్టర్ ట్రక్కుల గడ్డిని నిల్వ చేసుకునేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండాపోయింది.
పశుపోషణ సాగేదెలా..
ఎండుగడ్డి సమస్య ఏర్పడటంతో రైతులకు ఏం చేయాలో అర్థంకాని పరిస్థితి ఏర్పడింది. ఏడాది పొడవునా పశుపోషణ ఎలాగనే ఆందోళన వారిని వెంటాడుతోంది. దాణా, పచ్చిగడ్డి కొనుగోలు చేసి పశుపోషణ అంటే పెద్దఎత్తున ఖర్చుతో కూడుకున్న పని. ఎండుగడ్డి ఉంటే కొంత ఖర్చు తగ్గుతోంది. ప్రస్తుతం కొన్నిచోట్ల ఎండుగడ్డి విక్రయాలు సాగుతున్నాయి. అయితే చిన్న మోపు రూ.వందకు విక్రయిస్తున్నారు. ట్రాక్టర్ ట్రక్కు గడ్డి కొనుగోలు చేయాలంటే రూ.25 వేలు వరకూ ఖర్చయ్యే పరిస్థితి నెలకొంది. ఇంత పెద్దమొత్తంలో వెచ్చించి ఎండుగడ్డి కొనుగోలు చేసే పరిస్థితిలో రైతులు లేరు. దీంతో రెండు పశువులు ఉంటే ఒక పశువును విక్రయించే ఆలోచనలో రైతులు ఉన్నట్లు చెబుతున్నారు. అదే జరిగితే రైతుల జీవనంపై తీవ్ర ప్రభావం పడుతోంది. పాలతో వచ్చే ఆదాయం తగ్గిపోవడంతో చాలా కుటుంబాలను ఆర్థిక కష్టాలు వెంటాడనున్నాయి. ప్రభుత్వం టిఎంఆర్ (టోటల్ మిక్సిడ్ దాణా) పేరుతో సబ్సిడీ ధరలకు రైతులకు అందిస్తోంది. ప్రస్తుతం 30 టన్నుల వరకూ ఇస్తున్నట్లు సమాచారం. దీన్ని మరింత ఎక్కువగా రైతులకు సరఫరా చేస్తే మేలు జరుగుతోంది. లేకపోతే పశులను రైతులు అయినకాడికి అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడనుంది. అదే సమయంలో పాలకొరత పెరిగి ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి రానుంది. ప్రభుత్వం ముందుగానే ఎండుగడ్డి విషయంలో ప్రత్యామ్నాయాలను ఆలోచించి రైతులకు అవగాహన కల్పించాల్సి ఉంది.










