మూఢత్వం ముదిరిపోతే అత్యంత ప్రమాదకర పరిణామాలకు దారి తీస్తుందనడానికి చిత్తూరు జిల్లా మదనపల్లె శివారులోని టీచర్స్ కాలనీలో ఇద్దరు కుమార్తెలను కన్న తల్లే గత ఆదివారం రాత్రి హత్య చేసిన ఘటన తాజా తార్కాణం. మూఢత్వం తలకెక్కి, తీవ్ర మానసిక స్థితిలో ఈ దారుణానికి పాల్పడిన తల్లిదండ్రులిద్దరూ ఉన్నత విద్యావంతులే కావడం గమనార్హం. హత్యకు గురైన యువతులు కూడా ఉన్నత చదువులు సాగిస్తున్నవారే! 'బిడ్డలిద్దరూ శివ పార్వతులు, నేను కాళికను' అని చెప్పడం, కరోనా టెస్ట్ నిర్వహిస్తుండగా 'నేను శివుడిని. నాకు కరోనా టెస్ట్ ఏంటి?' అంటూ బిగ్గరగా కేకలు వేయడం మానసిక స్థితి ఎంత తీవ్ర స్థితిలో వుందో విదితమవుతోంది. పిల్లలు మరణానికి ముందు వారి సోషల్ మీడియా అకౌంట్లలో పెట్టిన పోస్టులూ వికల మన:స్థితిని వెల్లడి చేస్తున్నాయి. మొత్తం ఆ కుటుంబంలోని నలుగురికీ మూఢత్వం పరాకాష్టలో ఉందని పోలీసుల దర్యాప్తులో వెల్లడవుతోంది. కాబట్టి ఉన్నత విద్యావంతులైనంత మాత్రాన మూఢత్వం తలకెక్కదనుకోరాదని ఈ ఘటన స్పష్టం చేస్తున్నది. ఇరవై ఒకటో శతాబ్దంలో శాస్త్ర సాంకేతిక పురోగతితో రాకెట్లను మించిన వేగంతో అభివృద్ధి చెందుతున్నామని భావిస్తున్న సమయంలో ఇటువంటి దారుణాలు చోటు చేసుకోవడంతో సమాజం పురోగమిస్తోందా? లేక రాతి యుగానికి తిరోగమనం చెందుతుందా అన్న సందేహాలు కలుగక మానవు.
కరోనా నేపథ్యంలో ఆ కుటుంబం ఏకాంతంలో జీవించడం ఒకే రకమైన పుస్తకాలను అధ్యయనం చేయడం తదితర తక్షణ పరిస్థితులను గురించి పోలీసులు, ఇరుగుపొరుగు వారి సమాచారాన్నిబట్టి మీడియా విశదీకరిస్తున్నది. పరిమితమైన ఈ విషయాలనేగాక దేశంలో నేడు నెలకొన్న లేదా గత దశాబ్ద కాలంగా కొన్ని శక్తులు పథకం ప్రకారం విస్తరింపజేస్తున్న మూఢత్వాలను గురించి సైతం పరిశీలించడం అవసరం. ఒకవైపు చంద్రయాన్ గురించి గొప్పగా చెబుతూనే మరోవైపు గోమూత్రం దివ్యత్వాన్ని వివరించే అమాత్యుల, ప్రభుత్వాధినేతల ప్రవచనాలనేమనాలి? వినాయకుడికి ఏనుగు తలను అతికించడం ప్లాస్టిక్ సర్జరీకి ప్రాథమిక రూపం అంటూ సైన్స్ కాంగ్రెస్‌లోనే ఓ అమాత్యవర్యుడు చెప్పాడంటే మూఢత్వాన్ని వారెంతలా నూరి పోస్తున్నారో తేటతెల్లమవుతోంది. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన విద్యా విధానంలో ప్రజల వాడుకలో లేని సంస్కృత భాషను జనంపై రుద్దడం సమాజాన్ని ముందుకు తీసుకుపోవడమా? లేక తిరోగమనమా?
కేంద్ర ప్రభుత్వ పెద్దలు మతతత్వ భావజాలాన్ని పెంచి పోషిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వమూ అందుకు తక్కువేం కాదన్న రీతిలో పోటీ పడడం మరీ అన్యాయం. హోమాలు, పూజలు, స్వామీజీలు, బాబాలు చుట్టూ రాజకీయ పార్టీలు, ప్రభుత్వాధికారులు తిరుగుతున్నారు. విప్లవ యోధుడు చేగువేరాతో మొదలుపెట్టిన జనసేనాని ఏ స్థాయికి దిగజారారో చూస్తే రాజకీయ వ్యవస్థ చుట్టూ ఆవరించిన మతమౌఢ్యం ప్రభావం కనపడుతుంది. కేంద్ర ప్రభుత్వము, రాష్ట్రంలోని ప్రధాన పార్టీలూ తాయెత్తులు, మొక్కుబడుల చుట్టూ రాజకీయాలు చేయడంతో ప్రధాన స్రవంతి మీడియాగా చెప్పబడేవారూ పోటీలు పడి వాటిని ప్రచారం చేశారు. రంగు రాళ్లు, వాస్తు, కొండదొరల జోస్యాలు పెద్ద వ్యాపార సామ్రాజ్యంగా పెరిగిపోతున్నాయి. సినిమాలు, టివి సీరియళ్లు, ఇటీవల పెరిగిన ఒటిటి లో కూడా పారలౌకిక అంశాలు, మానవాతీత శక్తులకు సంబంధించినవే ప్రధానాంశాలుగా చిత్రించడం పెరిగింది. ఆధునిక విజ్ఞానం సాధించిన పురోగతి ఫలితంగా మనకు అందుబాటులోకి వచ్చిన ఆధునిక మీడియా అత్యంత అనాగరిక, మూఢత్వ భావజాలానికి ప్రచార వేదికగా దిగజారడం మన ముందు కనిపిస్తున్న పెద్ద విషాదం. ఈ మూఢత్వాన్ని ప్రజలు పూర్తిగా తలకెక్కించుకొని ఆచరించడానికి పూనుకుంటే ఏమవుతుందో మదనపల్లె ఉదంతం మనకు తెలియజేస్తోంది. ఇటువంటి అంశాలను ఎక్కడికక్కడ, ఎప్పటికప్పుడు పౌర సమాజం తిరస్కరించకపోతే ఇలాంటి దుష్పరిణామాలు మరిన్ని చోటు చేసుకుంటాయి. తిరోగమన భావాలను, పోకడలనూ ముందుకు తెచ్చేవారిని, ప్రోత్సహించేవారినీ తిరస్కరించాలి. శాస్త్రీయ భావాల వ్యాప్తితోటే జాతి పురోగమనం ముడిపడి వుంటుంది. అందుకోసం ప్రగతికాముక శక్తులు నడుంకట్టాలి.










