Jan 30,2023 23:11

ప్రజాశక్తి-వన్‌టౌన్‌: సమాజంలో పరిడిల్లుతున్న మూఢనమ్మకాలను వదిలేయాలని జెవివి రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్‌ చల్లా రవికుమార్‌ విద్యార్థులకు సూచించారు. బాలోత్సవం ఐదవ పిల్లల పండుగ రెండవ రోజు సోమవారం కెబిఎన్‌ కళాశాల కాన్ఫరెన్స్‌ హాలులో ''విద్యార్థులు - శాస్త్రీయ ఆలోచన'' అనే అంశంపై సెమినార్‌ నిర్వహించారు. కెబిఎన్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ వంగల నారాయణరావు అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో చల్లా రవికుమార్‌ మాట్లాడుతూ సమాజంలో ప్రతి విషయాన్ని ప్రశ్నించడంతో పాటు సమాధానాన్ని రాబట్టాలన్నారు. సైన్సుకు, టెక్నాలజీకి ఉన్న తేడాను ఆయన వివరించారు. సైన్సుతో పాటు టెక్నాలజీ కూడా అభివృద్ధి చెందటంతో మానవుడు అన్ని రంగాల్లో ముందుకు దూసుకు వెళ్తున్నాడని తెలిపారు. మానవుడు నిప్పు కనిపెట్టిన దగ్గర నుంచి ఆవిరి యంత్రాలు రావడంతో అభివృద్ధి సాధ్యమైందన్నారు. మనుగడ కోసం మనిషి పోరాటం చేయాల్సిందేనన్నారు. ప్రకతిలో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు గమనించి అందుకు అనుగుణంగా సమాజం ముందుకు సాగడం వల్లే వ్యవసాయ విప్లవం మొదలై గ్రామాలు అభివద్ధి చెందాయని చెప్పారు. టెక్నాలజీ అభివద్ధి చెందడంతో పట్టణాలు అభివద్ధి అయ్యాయని వివరించారు. ఒక విషయం మీద ప్రయోగం చేసినప్పుడు 99 సార్లు విఫలమైనా వెనకడుగు వేయకూడదని, వందో సారి విజయం సాధించాలని అన్నారు. నిర్ధారణ, రుజువులకు మించినదే సైన్సు అని తెలిపారు.
ఇదే కాన్ఫరెన్స్‌ హాలులో ''విద్యార్థులు - సైన్స్‌''పై జరిగిన సదస్సులో డాక్టర్‌ తుమ్మల శ్రీకుమార్‌ పాల్గొని మాట్లాడుతూ సమాజంలో విజ్ఞానం గురించి ప్రతిఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతోనే దేశం అభివద్ధి చెందుతుందన్నారు. తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రు చెప్పిన మాటలు నేటికీ అనుసరణీయమన్నారు. వాస్తవాన్ని ప్రయోగంగా మార్చి అభివద్ధి చేయాలని చెప్పారు. ప్రతిఒక్కరికీ ప్రాథమిక హక్కులతో పాటు బాధ్యతలు కూడా ఉంటాయని చెప్పారు. లింగ సమానత్వంతో పాటు మానవ సమానత్వం ఉండాలని చెప్పారు. పేద, గొప్ప తేడాలేని సమాజం కోసం కషి చేయాలని విద్యార్థులకు పిలుపు నిచ్చారు. ప్రకతిని కాపాడితే అది ప్రజలకు కాపాడుతుందని గుర్తుంచుకోవాలన్నారు. కాలానికి అనుగుణంగా సైన్సు కూడా మారుతుందని చెప్పారు. ఈ సదస్సులో అమరావతి బాలోత్సవం అధ్యక్షులు ఎస్‌పి రామరాజు, బాలోత్సవాల రాష్ట్ర సమన్వయకర్త పి.మురళీకష్ణ, గుమ్మా సాంబశివరావు, వెన్నా వల్లభరావు, జ్యోత్స్న, యార్లగడ్డ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.