రానున్న కొద్ది మాసాల్లో...సాధ్యమైనంత ఎక్కువ మంది ప్రజలకు టీకా వేయాలి. రోజుకు కోటి మంది ప్రజల చొప్పున వేయాలి. వ్యాధి సంక్రమించకుండా ఇది నియంత్రిస్తుంది. వైరస్ జన్యు మార్పు కారణంగా కొత్త వేరియంట్లు కనిపిస్తూ వుంటాయి. ఎప్పటికప్పుడు పర్యవేక్షణ, పరీక్షలు చాలా ముఖ్యం. ఈ డేటాను భాగస్వాములందరితో చర్చించడం ద్వారా పరిష్కార చర్యలు తీసుకోగలుగుతాం. కనీసం మరో సంవత్సరం పాటు కోవిడ్ జాగ్రత్తలు తీసుకోవాలి.
వైరల్ మహమ్మారి పలు దఫాలుగా (వేవ్స్) మానవాళిపై విరుచుకు పడుతుందని చరిత్ర చెప్తోంది. మనిషికి వైరస్‌కు మధ్య జరిగే దుర్మార్గపు యుద్ధంలో...పేలవమైన రోగనిరోధకశక్తి గలవారు, అనారోగ్యకర జీవనశైలి గలవారు మరణిస్తారు. అంతకంటే మెరుగైన రోగనిరోధక శక్తి గలవారికి వైరస్ సోకినప్పటికీ కోలుకుంటారు. ఆ తర్వాత వైరస్‌తో పోరాడే శక్తి వారిలో వృద్ధి చెందు తుంది. అయినప్పటికీ, మానవుల్లోని రక్షణ వ్యవస్థను ఛేదించుకుని చొరబడేందుకుగాను...తన ప్రొటీన్ నిర్మాణాన్ని మార్చుకోవడం ద్వారా వైరస్ నిరంతరం రూపాంతరం చెందుతుంటుంది.
ఒక్కో దశ ఎంతకాలం ?
ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 మొదటి దశ వచ్చిన 5.5 నెలల తర్వాత రెండవ దశ వచ్చింది. మహమ్మారి ముందరి దశ కంటే ఆ తర్వాతి దశ ఎప్పుడూ పెద్దదిగానే వుంటుంది. మొదటి దశ కంటే రెండవది 75 శాతం పెద్దదిగా వుంది. ఏదేమైన ప్పటికీ...భారత్‌లో ఏడున్నర నెలల గ్యాప్ తర్వాత వచ్చిన కోవిడ్ రెండవ వేవ్ 320 శాతం పెద్దదిగా వుంది.
మూడవ వేవ్‌ను ఎదుర్కోవడం ఎలా ?
ఇందుకుగాను ఆరు ముఖ్యమైన అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. 1. రానున్న కొద్ది మాసాల్లో...సాధ్యమైనంత ఎక్కువ మంది ప్రజలకు టీకా వేయాలి. రోజుకు కోటి మంది ప్రజల చొప్పున వేయాలి. వ్యాధి సంక్రమించకుండా ఇది నియంత్రిస్తుంది. ఏడవ రోజున సగటు కేసులు (కోవిడ్ పాజిటివిటీ రేటు) 5 శాతం కంటే తక్కువ నమోదైనప్పుడు మహమ్మారి నియంత్రణలో వున్నట్టు మనం భావించాలి. 2. వైరస్ జన్యు మార్పు కారణంగా కొత్త వేరియంట్లు కనిపిస్తూ వుంటాయి. వీటిని ఎప్పటికప్పుడు కనిపెడుతుండాలి. 3. పర్యవేక్షణ, పరీక్షలు చాలా ముఖ్యం. ఈ డేటాను ఎప్పటికప్పుడు భాగస్వాములందరితో చర్చించడం ద్వారా పరిష్కార చర్యలు చేపట్టగలుగుతాం. 4. పది జాతీయ సంస్థలకు చెందిన ప్రసిద్ధ శాస్త్రవేత్తలు ఇప్పటికే ఒక గ్రూపుగా ఏర్పడ్డారు. తమ విశ్లేషణలు, గణాంకాలను నిరంతరం చర్చించడం ద్వారా భవిష్యత్ ప్రణాళికలు వేసుకోవడానికి, తగు నిర్ణయాలు తీసుకోవడానికి వీలవుతుంది. 5. కనీసం మరో సంవత్సరం పాటు కోవిడ్ జాగ్రత్తలు తీసుకోవాలి. మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, సబ్బు లేదా శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకోవడం, గుంపులకు లేదా జన సమీకరణలకు దూరంగా వుండడం వంటివి చేయాలి. 6. ఆచరణాత్మక ఆరోగ్య రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. కోవిడ్ మహమ్మారి మన లోపాలను ఎత్తిచూపింది. అనేక సంవత్సరాలుగా అవసరమైనంత మేరకు ఆరోగ్య రక్షణ గురించి శ్రద్ధ తీసుకోలేదు. వైద్య సిబ్బంది సరిపడా లేరు. 10,000 మంది జనాభాకు 9 మంది వైద్యులు వున్నారు. అదే బ్రిటన్ లో 28, అమెరికాలో 26, జర్మనీలో 42 మంది డాక్టర్లు వున్నారు. 10 వేల మంది జనాభాకు 15 కంటే తక్కువ మంది నర్సులు వున్నారు. బ్రిటన్‌లో 150, జర్మనీలో 132, అమెరికాలో 85 మంది నర్సులు వున్నారు.
ఆరోగ్యవంతమైన జీవనశైలి
బలమైన రోగనిరోధక శక్తి ప్రాధాన్యతను కోవిడ్ మహమ్మారి మనకు తెలియచేసింది. కొన్ని రకాల ఆహార పదార్థాలను తినడం ద్వారా వారం లేదా రెండు వారాల్లో వ్యాధి నిరోధక శక్తిని పొందగలమని మనం అనుకుంటాం. కాని అది నిజం కాదు. కొన్ని నెలల పాటు ఆరోగ్యవంతమైన జీవనశైలిని అనుసరించడం (ప్రతి రోజూ కనీసం గంటసేపు వ్యాయామం చేయడం, ఊబకాయం రాకుండా చూసుకోవడం, సమీకృత ఆహా రాన్ని తీసుకోవడం, రోజుకు కనీసం 7 లేదా 8 గంటల పాటు నిద్ర పోవడం, ఒత్తిడిని దరిచేరకుండా చూసు కోవడం, పొగాకు ఉత్పత్తులకు-మద్యానికి దూరంగా వుండడం) ద్వారా మాత్రమే దృఢంగా తయారవుతాం.
అనివార్యమే...
కోవిడ్ మూడవ దశ అనివార్యం. త్వరలోనో లేదా మరికొద్ది రోజుల తర్వాతో మూడవ వేవ్ వచ్చినప్పుడు శాస్త్రీయ పద్ధతుల్లో దానిని ఎదుర్కోవచ్చు. అయితే ఇందుకు విధాన నిర్ణేతలు, పాలకులు, శాస్త్రవేత్తల సమిష్టి కృషి అవసరం. కోవిడ్ మొదటి రెండు దశల్లో మనం నేర్చుకున్న చేదు పాఠాలు...గతం కంటే మెరుగ్గా మూడవ వేవ్‌ను ఎదుర్కోవడానికి మనల్ని సన్నద్ధం చేస్తాయి.
/ వ్యాసకర్త శ్వాసకోశ వ్యాధి నిపుణులు /
డా|| ఆర్. విజయ్ కుమార్










