ప్రజాశక్తి - కర్నూలు కలెక్టరేట్
అన్ని భవనాలకు సంబంధించిన లేఅవుట్ ప్లాన్‌ను రూపొందించి మూడు రోజుల్లోపు తనకు సమర్పించాలని కల్లూరు తహశీల్దార్‌ను కలెక్టర్ డాక్టర్ జి.సృజన ఆదేశించారు. సాధారణ ఎన్నికల దృష్ట్యా ముందస్తు ఏర్పాట్లలో భాగంగా రాయలసీమ యూనివర్సిటీ భవనాలను కలెక్టర్ సృజన, ఎస్పీ కృష్ణకాంత్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్, ఎస్పీ మాట్లాడారు. రానున్న సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా జిల్లాలోని అన్ని అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించిన ఈవిఎంలను భద్రపరచేందుకు స్ట్రాంగ్ రూములను, కౌంటింగ్ హాల్ ఏర్పాటు చేసేందుకు వర్సిటీలోని లైఫ్ సైన్స్, ఇంజినీరింగ్ బ్లాక్, డేటా సెంటర్, లైబ్రరీ, పాత లైబ్రరీ, అకాడమిక్ బ్లాక్-2 తదితర భవనాలను పరిశీలించినట్లు తెలిపారు. అలాగే నగరంలోని ప్రాంతీయ ముద్రణ కార్యాలయాన్ని కూడా పరిశీలించారు. రాయలసీమ యూనివర్సిటీ రిజిస్ట్రార్ వెంకటసదానంద, ఇన్‌ఛార్జీ డిఆర్‌ఒ మల్లికార్జునుడు, కర్నూలు ఆర్‌డిఒ హరిప్రసాద్, కల్లూరు తహశీల్దార్ రమేష్ బాబు పాల్గొన్నారు.
రాయలసీమ యూనివర్సిటీలో పరిశీలిస్తున్న కలెక్టర్, ఎస్పీ