Dec 29,2022 23:56

రోడ్డు విస్తరణలో కూల్చిన ఇళ్ల వద్ద బాధితులు

ప్రజాశక్తి- బుచ్చయ్యపేట
బుచ్చయ్యపేట మెయిన్‌ రోడ్డు విస్తరణలో ఇళ్లు కోల్పోయిన బాధితులకు మూడున్నరేళ్లయినా న్యాయం జరగలేదు. దీంతో వీరంతా శుక్రవారం నర్సీపట్నం వస్తున్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి వినతిపత్రం ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. 2018లో టిడిపి ప్రభుత్వ హయాంలో బుచ్చయ్యపేట మెయిన్‌ రోడ్డు విస్తరణకు నాటి శాసనసభ్యులు కెఎస్‌ఎన్‌ఎస్‌ రాజు, స్థానిక నాయకులు కలిసి రోడ్డు విస్తరణకు చర్యలు తీసుకున్నారు. ఇళ్లు కోల్పోయే బాధితులకు ప్రభుత్వం నుండి ఇళ్లు మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం రోడ్డు వెడల్పు చేయడానికి రహదారికి ఇరువైపులా ఉన్న ఇళ్లను ఆ ఇళ్ల యజమానుల అంగీకరించడంతో తొలగించారు. ఈ విధంగా సుమారు 25 మంది ఇళ్లు పూర్తిగాను, మరో 25 మంది ఇళ్లు పాక్షికంగాను కోల్పోయారు. ఇళ్లు కోల్పోయిన బాధితులకు ఇళ్లను మంజూరు చేయడానికి నాడు ప్రతిపాదనలు సైతం సిద్ధం చేశారు. ఈ లోగా 2019 సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్‌ రావడంతో ఇళ్ల మంజూరు నిలిచిపోయింది. సార్వత్రిక ఎన్నికల్లో వైసిపి అభ్యర్థిగా ఉన్న ప్రస్తుత శాసనసభ్యులు కరణం ధర్మశ్రీ తాను విజయం సాధిస్తే బాధితులందరికీ ఇళ్లు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఆయన గెలిచారు. ఆయన పార్టీ అధికారంలోకి వచ్చింది. కాని నేటికీ రోడ్డు విస్తరణలో ఇళ్లు కోల్పోయిన వారికి ఇళ్లు మంజూరు చేయలేదు. మూడున్నరేళ్లుకావస్తున్న సహాయం ఏమీ అందలేదని బాధితులు వాపోతున్నారు. దీంతో శుక్రవారం ముఖ్యమంత్రిని కలిసి తమ సమస్యను విన్నవించనున్నట్లు బాధితులు పేలూరి నారాయణమ్మ, పాతాళ అప్పారావు, మొక్క జల్లమ్మ, పాతాళ రాము తదితరులు తెలిపారు.