ప్రజాశక్తి -ఫిరంగిపురం : మండలంలో ఉపాధి కూలీలకు రావాల్సిన బకాయి వేతనాలు రూ.14,57.900 లక్షలనూ, పొనుగుపాడు గ్రామంలో రావాల్సిన బకాయి వేతనాలు రూ.32,091 వేలను వెంటనే చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం గుంటూరు జిల్లా కార్యదర్శి ఈమని అప్పారావు డిమాండ్ చేశారు. బుధవారం పొనుపాడు గ్రామంలో ఉపాధి పని జరుగుతున్న పని ప్రదేశాన్ని సందర్శించి ఉపాధి కూలీలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కూలీలు వారి యొక్క సమస్యలను వ్యవసాయ కార్మిక సంఘం బృందం దృష్టికి తీసుకువచ్చారు. కంప్యూటర్‌లో పేరు రాలేదని పని ఇవ్వటం లేదని, మూడు వారాలుగా డబ్బులు రాలేదని తెలిపారు. ఎండ తీవ్రంగా ఉంటుందని మంచినీళ్లకు ఇబ్బంది కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఈమని అప్పారావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టానికి నిధులు తగ్గించిందని, ఉపాధి హామీ పనికి కొత్త కొత్త నిబంధనలు తీసుకొచ్చారని రెండు పూటల పని పద్ధతి, మాన్యువల్ మాస్టర్ బదులు ఆన్లైన్ మాస్టర్ వల్ల నెట్టు అందక పోవడం వల్ల ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. కనీస వేతనం రూ.272లగా నిర్ణయించినప్పటికీ ఇది ఎక్కడా అమలు జరగడం లేదని తెలియజేశారు. అలాగే పని చేసిన చోట కనీస సౌకర్యాలు కూడా ఇవ్వటం లేదని టెంట్ , మంచినీళ్లు, మెడికల్ కిట్టులు అందజేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఇచ్చే సదుపాయాలు కూడా రద్దు చేసిందని వెంటనే వాటిని పునరుద్దరించి, పలుగుకు రూ.50లు,తట్టకురూ.20లు, మంచినీళ్లకు రూ.10లు ఇవ్వాలని తెలిపారు. అలాగే క్షేత్రస్థాయిలో మేట్లకు స్మార్ట్ ఫోన్ అందజేసి రూ.5లు పారితోషికం ఇవ్వాలని ఆయన కోరారు. ఉపాధి హామీ చట్టాన్ని కాపాడుకునేందుకు, అలాగే బకాయి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ మే 22న జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే ధర్నాలు ఉపాధి కూలీలు పెద్ద ఎత్తున పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మండలం రైతు సంఘం నాయకులు జి. వెంకటేశ్వరరావు , ఉపాధి కూలీలు పాల్గొన్నారు.










