బాగా వృద్ధిరేటు ఉన్న కాలంలో సైతం నయా ఉదారవాద విధానాలు శ్రామిక ప్రజలను పీల్చి పిప్పి చేశాయి. ఇప్పుడు వృద్ధిరేటు తగ్గి, సంక్షోభం ముదిరిన కాలంలో మరింతగా ప్రజల మూలుగులను పీల్చివేయడమే గాక, భారత రాజ్యాంగానికి పునాదిరాళ్ళుగా ఉన్న ప్రజాస్వామ్యం, లౌకిక విధానం, సామాజిక న్యాయం వంటి మౌలిక విషయాలపైనే దాడికి పూనుకుంటున్నాయి.
భారతదేశం నయా ఉదారవాద విధానాల అమలును మొదలుపెట్టి ముప్పై సంవత్సరాలు పూర్తైంది. 1991లో ఈ విధానాల అమలు ప్రారంభం అయింది (ఐతే, కొందరు ఈ విధానాలు 1985 నుండే మొదలైనట్టు భావిస్తున్నారు). ఆర్థిక వ్యవస్థ మీద ఈ విధానాల ప్రభావం ఏవిధంగా పడిందన్న విషయం మీద వార్తా పత్రికలన్నీ తమ అంచనాలను పుంఖానుపుంఖాలుగా ప్రచురిస్తున్నాయి. మన్మోహన్ సింగ్ తో సహా ఉదారవాదులందరూ మళ్ళీ తెర మీదకు వస్తున్నారు. ఈ విధానాలను అమలు చేయడంలో తమ వంతు కృషి గురించి గొప్పలు చెప్పుకుంటున్నారు. మహా అయితే, ఈ ఉదారవాద విధానాల ఫలితాలు అందరికీ ఒకే మోతాదులో పంపిణీ కాలేదని వాపోతున్నారంతే. ''ప్రతీ భారతీయుడికీ ఆరోగ్యవంతమైన, గౌరవప్రదమైన జీవితాన్ని కల్పించడం ప్రాధాన్యతగా ఉండాలి'' అని ఇటీవల మన్మోహన్ సింగ్ అన్నారు. ఐతే, అతని సారథ్యంలోనే దేశ ఆర్థిక వ్యవహారాలు నడిచిన కాలంలో ఆ విధమైన ప్రాధాన్యతను ఇవ్వడానికి ఎవరు అడ్డు వచ్చారో అది మాత్రం మనకెవరికీ అంతుపట్టదు.
నయా ఉదారవాద విధానాలు భారతదేశ జిడిపి వృద్ధిరేటును గొప్పగా పెంచగలిగాయని, తద్వారా దాదాపు ప్రతీ భారతీయుడి జీవితాన్నీ ఎంతో మెరుగుపరిచాయని, నిష్ట దరిద్రం బారి నుండి అధిక సంఖ్యలో ప్రజలను బైటకు తెచ్చాయని, ఐతే, ఈ విధానాల వలన ఆదాయాల్లో, సంపదలో వ్యత్యాసాలు కొంత పెరిగిన మాట వాస్తవమేనని దాదాపు అందరూ అంగీకరిస్తున్నారు. కేవలం నయా ఉదారవాద విధానాల సమర్ధకులే కాదు, వామపక్ష వాదులలో సైతం కొందరు ఈ అభిప్రాయంతోటే ఉన్నారు. తేడా అంతా వృద్ధికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారా లేక అసమానతలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారా అన్నదగ్గరే. ఈ అసమానతల దుష్ప్రభావం అంతరించి పోవాలంటే మళ్ళీ వృద్ధి రేటును పునరుద్ధరించాలని కూడా ఉదారవాదులు వాదిస్తున్నారు. పెట్టుబడిదారులు మరింత ఎక్కువ పెట్టుబడి పెట్టేలా వారి ''పాశవిక ప్రవృత్తి'' (యానిమల్ స్పిరిట్స్)ని ప్రేరేపించేలా నయా ఉదారవాద విధానాల అమలును కొనసాగించాలని వారంటున్నారు. తాము ప్రస్తుతం ఆ ''పాశవిక ప్రవృత్తి''ని ప్రేరేపించే దిశగానే వ్యవహరిస్తున్నామని మోడీ ప్రభుత్వం చెప్పుకుంటోంది. తాము జారీ చేసిన కార్మిక వ్యతిరేక, రైతాంగ వ్యతిరేక చట్టాలన్నీ అందుకోసమేనని మోడీ ప్రభుత్వం అంటోంది. ఆర్థిక విధానాల విశ్లేషణ విషయంలో వేరే భిన్నాభిప్రాయం లేకపోయినా, కాంగ్రెస్ పార్టీ మోడీ విధానాలలో కొన్నింటిని మాత్రం వ్యతిరేకించడం ఆసక్తిని కలిగించే విషయం. బ్రెట్టన్‌వుడ్ సంస్థలు (ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంక్) గతంలో ఈ నయా ఉదారవాద విధానాల విషయంలో ప్రధాన రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం ఉన్నట్టు ప్రకటించాయి. ఇప్పుడు కూడా ఆ విధానాలను గత మూడు దశాబ్దాలుగా అమలు జరిపినందున కలిగిన ఫలితాల విషయంలో కూడా అటువంటి ఏకాభిప్రాయమే ఉన్నట్టు చెప్తున్నాయి.
ఐతే, ఈ మొత్తం దృక్పథమే పూర్తిగా తప్పు. తక్కిన ఆర్థిక వ్యవస్థతో ఏమాత్రమూ సంబంధం లేకుండా విడిగా పెట్టుబడిదారీ వర్గం యొక్క రంగం ఉంటుందని ఈ దృక్పథం పరిగణిస్తుంది. తక్కిన వ్యవస్థ నుండి అంతకంతకూ ఎక్కువమంది కార్మికులను తన వైపుకు లాక్కొనడమే అది పరిసరాల మీద కలిగించే ప్రభావం అని భావిస్తుంది. ఆ విధంగా అవసరమైన మేరకు జరగడంలేదని వాపోతుంది. కాని, వాస్తవానికి పెట్టుబడిదారీ రంగంలో ఒక దగ్గర సంపద పోగుబడుతున్నందున దాని పర్యవసానాలు తక్కిన ప్రపంచం మీద బహు విధాల ప్రభావం చూపుతాయి. పెట్టుబడి తక్కిన ప్రపంచం నుండి శ్రామికులను తనవైపు లాక్కుంటుంది. చాలా పెద్ద సంఖ్యలో రిజర్వు శ్రామికులు (నిరుద్యోగులు) ఉన్న ఈ పరిస్థితుల్లో అది మంచిదే. కాని, శ్రామికులతోబాటు భూమిని, ఇతర వనరులను కూడా అది లాక్కుంటుంది. ఈ ఇతర వనరులలో ద్రవ్య వనరులు కూడా ఉంటాయి (ఉదాహరణకు, వ్యవసాయ రంగానికి ఇంతకాలమూ ఇస్తూ వచ్చిన సబ్సిడీలను కూడా పెట్టుబడిదారీ వర్గం లాక్కుంటున్నది. వాస్తవానికి వ్యవసాయ రంగంలో సాధించిన అభివృద్ధి పెట్టుబడిదారీ వ్యవస్థ నిలదొక్కుకోడానికి ఇంతకాలమూ తోడ్పడింది. కాని, పెట్టుబడిదారుల ''పాశవిక ప్రవృత్తి''ని ప్రేరేపించడానికి వ్యవసాయ సబ్సిడీలను రద్దు చేసి ఆ మొత్తాన్ని నేరుగా పెట్టుబడిదారులకే అర్పిస్తున్నారు). పైగా సాంప్రదాయ రంగాలలో ఉత్పత్తి అయ్యే సరుకుల డిమాండ్ ను కూడా పెట్టుబడిదారీవర్గం దెబ్బ తీస్తుంది.
ఆ విధంగా పెట్టుబడి పోగుబడే క్రమం వలన పరిసరాల్లోని చిన్న ఉత్పత్తి ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది (ఈ క్రమాన్నే కొల్లగొట్టి పోగేసుకునే పెట్టుబడి- ప్రిమిటివ్ అక్యుములేషన్-అని మార్క్స్ అన్నాడు). ఈ క్రమంలో చుట్టుపక్కల నుండి కొంతమంది శ్రామికులను అది తనలోకి లాక్కుంటుంది. కాని ఆ శ్రామికుల సంఖ్య కన్నా ఎక్కువమంది చిన్న ఉత్పత్తి ఆర్థిక వ్యవస్థ దెబ్బ తిన్నందువలన తమ జీవనోపాధి కోల్పోతారు. శరవేగంగా పెట్టుబడి పోగుబడితే, అది రిజర్వు శ్రామికులనందరినీ తనలో ఇముడ్చుకోగలుగుతుందని, తద్వారా నిరుద్యోగం. పేదరికం తొలగిపోతాయని సాంప్రదాయ బూర్జువా ఆర్థికవేత్తలు వాదిస్తుంటారు (ఒక వేళ పేదరికం, నిరుద్యోగం పూర్తిగా తొలగకపోతే దానికి పరిష్కారం మరింత వేగంగా పెట్టుబడి పోగుబడేటట్టు చర్యలు తీసుకోవడమేనని వారు చెప్తారు). కాని, వారు చెప్పేదానికి పూర్తి విరుద్ధంగా, పెట్టుబడి పోగుబడినందువలన చుట్టుపక్కల ఉండే చిన్న ఉత్పత్తుల ఆర్థిక వ్యవస్థ దెబ్బ తినిపోవడమే గాక, అదనంగా ఉద్యోగాలు లభించే శ్రామికుల సంఖ్య చాలా స్వల్పంగానే ఉంటుంది.
ప్రభుత్వ గణాంకాల ప్రకారమే చూసుకున్నా, మనకు కనిపించేది ఇదే. అంతవరకూ, ప్రభుత్వ నియంత్రణలో ఆర్థిక వ్యవస్థ కొనసాగిన కాలంలో చిన్న రైతు వ్యవసాయానికి లభించిన రక్షణ అంతా నయా ఉదారవాద కాలంలో అంతరించిపోయింది. దాంతో వ్యవసాయం గిట్టుబాటు కాకుండా పోయింది. 1991 నుండి 2011 మధ్య పంటలు పండించే రైతుల సంఖ్య కోటి యాభై లక్షలు తగ్గిపోయింది. ఈ కాలంలోనే మనం మూడు లక్షల మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్న హృదయ విదారక సంఘటనలను చూశాం.
పేదరికాన్ని అంచనా వేసే ప్రాథమికమైన కొలబద్ద తలసరి ఆహార ధాన్యాల లభ్యత. దీనిని ఆ ఆహారధాన్యాల కేలరీల విలువలో కొలుస్తారు. తలసరి 2200 కేలరీల కన్నా తక్కువ లభించేవారంతా పేదరిక స్థాయికి దిగువన ఉన్నట్టుగా పరిగణించాలన్నది ప్రభుత్వమే నిర్ణయించిన గీటురాయి. గ్రామీణ జనాభాలో తలసరి 2200 కేలరీల కన్నా తక్కువ విలువ ఉన్న ఆహారధాన్యాలు పొందినవారు 1993-94 నాటికి 58 శాతం ఉంటే 2022-12 నాటికి వారి శాతం 68 కి పెరిగింది. పట్టణ ప్రాంతాలకు 2100 కేలరీలు గీటురాయి. 1993-94లో పట్టణ ప్రాంతాల్లో 2100 కన్నా తక్కువ కేలరీల విలువ కల ఆహార ధాన్యాలను పొందినవారి శాతం 57 కాగా అది 2011-12 నాటికి 65 కు పెరిగింది.
2011 తర్వాత పరిస్థితులు మరింత ఘోరంగా దిగజారాయి. 2017-18 జాతీయ శాంపిల్ సర్వే వెల్లడించిన గణాంకాలు ఎంత గగుర్పాటును కలిగించాయంటే మోడీ ప్రభుత్వం ఆ గణాంకాలను కప్పిపెట్టడమే గాక, ఆ పద్ధతులలో ఇకముందు సర్వేలు జరపకూడదని నిర్ణయించింది. ఈ విధంగా కప్పిపుచ్చే లోపుగానే కొన్ని గణాంకాలు బైటకు పొక్కాయి. ఆ వివరాలను బట్టి 2011 నుండి 2017 మధ్య గ్రామీణ ప్రాంతాలలో తలసరి వినిమయం ఏకంగా 9 శాతం మేరకు తగ్గిపోయింది. ఎప్పుడో, పంటలు దారుణంగా దెబ్బ తిన్న కాలాల్లో తప్ప స్వతంత్ర భారత దేశంలో ఎన్నడూ ఇంత అన్యాయంగా వినిమయం తగ్గిపోయింది లేదు.
వాస్తవానికి చిన్న రైతు వ్యవసాయం మీద నయా ఉదారవాద దాడి ఇంకా తీవ్రం అవుతూనే వుంది. తాజాగా జారీ చేసిన మూడు వ్యవసాయ చట్టాలూ ఆ చిన్న రైతాంగాన్ని బలిపెట్టి బడా కార్పొరేట్ల ప్రయోజనాలను నెరవేర్చే లక్ష్యంతోటే రూపొందాయి. ఈ చట్టాలు అంత దారుణంగా ఉండబట్టే దేశంలోని రైతాంగం, ముఖ్యంగా దేశ రాజధాని చుట్టుపట్ల ఉండే రైతాంగం ఆ చట్టాలను ఉపసంహరించాలని కోరుతూ భారీ సంఖ్యలో ఢిల్లీ కి తరలి వచ్చారు.
నయా ఉదారవాద దృక్పథంలోని రెండో పొరపాటు గురించి చూద్దాం. పెట్టుబడిదారులు పెట్టుబడి పెట్టడం అనేది ఎవరూ అంచనా కట్టలేని ''పాశవిక ప్రవృత్తి'' మీద ఆధారపడి వుంటుందనుకోవడం పొరపాటు. స్పష్టంగా అంచనా వేయగలిగిన అంశాల పైనే ఆధారపడి ఆ పెట్టుబడులు ఉంటాయి. మార్కెట్లు రానున్న కాలంలో ఏ మేరకు వృద్ధి చెందనున్నాయన్న విషయాన్ని అంచనా వేసుకుని పెట్టుబడులు పెట్టడానికి ప్లాను చేసుకుంటారు. ఆ అంచనాలను వేసే సందర్భంగా ఆశావహ దృక్పథంతో ఉంటారా లేక నిరాశావహులై ఉంటారా అన్న విషయంలో మాత్రమే ''పాశవిక ప్రవృత్తి'' అన్నది వర్తిస్తుంది. అంతే కాని మార్కెట్ లో పెరుగుదల కనపడకపోయినా పెట్టుబడులు పెట్టడానికి ఏ పెట్టుబడిదారుడూ ముందుకు రాడు. అతగాడికి ఎంత పెద్ద మొత్తంలో సబ్సిడీలు ఇచ్చినా సరే ముందుకు రాడు.
ఇప్పుడు భారతదేశంతో సహా ప్రపంచమంతటా నయా ఉదారవాద విధానాలు ఆదాయాల్లో అసమానతలను తీవ్రంగా పెంచివేశాయి. మన దేశంలోని జాతీయ ఆదాయంలో అత్యంత సంపన్నుల వాటా (వారు జనాభాలో ఒక్క శాతం మాత్రమే) 6 శాతంగా 1982 నాటికి ఉండేది కాస్తా 2013-14 వచ్చేసరికి 22 శాతానికి అమాంతం పెరిగిపోయింది (పికెటీ మరియు చాన్సెల్ వేసిన అంచనాలు). ఇది గత శతాబ్దంలోకెల్లా అత్యంత అధికమైన పెరుగుదల. దేశ జనాభాలో ఎక్కువ వినిమయం చేసేది శ్రామిక ప్రజలు. అతి స్వల్పంగా వినిమయం చేసే సంపన్నుల వైపుకు సంపద తరలిపోయింది. అందువలన శ్రామిక ప్రజల వినిమయం మొత్తం మీద తగ్గిపోతున్నది. అంటే మొత్తం మీద డిమాండ్ పడిపోతున్నది. అందువలన పెట్టుబడి పెట్టడం తగ్గిపోతున్నది. దానివలన వృద్ధి రేటు తగ్గిపోతోంది.
ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడిదారీ ప్రపంచంలో అమలులో ఉన్న నయా ఉదారవాదం ఆర్థిక మాంద్యం అనే జబ్బుతో బాధపడుతోంది. ఈ జబ్బును నెమ్మదింపజేయడానికి అప్పుడప్పుడు ఏర్పడే ''బుడగలు'' కొంత తోడ్పడుతున్నాయి. అమెరికాలో 1990 దశకంలో వచ్చిన 'డాట్‌కామ్ బబుల్'', ఆ తర్వాత ఈ శతాబ్దపు తొలి దశాబ్దంలో (2000-2010) వచ్చిన ''హౌసింగ్ బబుల్'' అటువంటివే. కాని ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దీర్ఘకాలంగా పట్టి పీడిస్తున్న సంక్షోభానికి నయా ఉదారవాదం ఎటువంటి పరిష్కారాన్నీ చూపలేకపోతోంది (తాను ఏ పరిష్కారాన్నీ చూపలేదు కాని ప్రభుత్వ నియంత్రణ మాత్రం ఏ విధంగానూ ఉండకూడదంటూ కన్నెర్ర చేస్తుంది).
ఈ ప్రభావం భారత దేశ ఆర్థిక వ్యవస్థ మీద కూడా పడింది. కరోనా మహమ్మారి రాక మునుపే, 2019 నాటికే ఇక్కడ నిరుద్యోగం గత 45 ఏళ్ళలోనూ అత్యధిక రేటుకు చేరింది. దీని వలన సామాన్య ప్రజల జీవితాలమీద రెండు రకాల ప్రభావం పడుతోంది. నయా ఉదారవాద విధానాల అమలు కారణంగా శ్రామిక ప్రజలంతా కరోనా మహమ్మారి సంభవించక మునుపే, దిగజారిన పరిస్థితులను చవిచూశారు. ఉపాధి కల్పన పడిపోవడం, వినిమయ స్థాయి పడిపోవడం ఇందుకు తార్కాణాలు.
ఇక రెండవ అంశం : సంక్షోభం ముదరడంతో బడా కార్పొరేట్ శక్తులకు ఫాసిస్టు హిందూత్వ మూకలకు మధ్య బంధం మరింత గట్టిపడింది. ఆ బంధమే మోడీ ప్రభుత్వాన్ని నిలబెడుతోంది. ఇటువంటి బంధం మన దేశానికి మాత్రమే ప్రత్యేకమైన అంశం కాదు. సంక్షోభ సమయాల్లో బడా పెట్టుబడి ఫాసిస్టు మూకలను బలపరచడమే గాక ఆర్థికంగా అవసరమైన తోడ్పాటును కూడా అందించడం పరిపాటి. ఆ ఫాసిస్టు శక్తుల అండతో సమాజంలో ప్రజల మధ్య చర్చను అసలు సమస్యలనుండి పక్కదోవకు మళ్ళిస్తుంది. కొంతమంది 'ఇతరులను'' చూపించి సమస్యలకన్నింటికీ వారే కారణమంటూ ప్రచారం చేసి ప్రజల దృష్టిని వారి ఆర్థిక స్థితిగతుల వైపుకు మళ్ళకుండా జాగ్రత్త పడుతుంది. అధికారంలో ఉండే రాజకీయ శక్తులు ఆ బడా కార్పొరేట్లు చెప్పినదల్లా ఆచరిస్తారు. తాము అధికారంలో కొనసాగడానికి వారు ప్రజల ఆర్థిక సమస్యలకు ఎటువంటి పరిష్కారాన్నీ చూపించరు. ప్రజల దృష్టిని ఆ ఆర్థిక విషయాల వైపునుండే మొత్తంగా పక్కకు మళ్ళిస్తారు.
బాగా వృద్ధిరేటు ఉన్న కాలంలో సైతం నయా ఉదారవాద విధానాలు శ్రామిక ప్రజలను పీల్చి పిప్పి చేశాయి. ఇప్పుడు వృద్ధిరేటు తగ్గి, సంక్షోభం ముదిరిన కాలంలో మరింతగా ప్రజల మూలుగులను పీల్చివేయడమే గాక, భారత రాజ్యాంగానికి పునాదిరాళ్ళుగా ఉన్న ప్రజాస్వామ్యం, లౌకిక విధానం, సామాజిక న్యాయం వంటి మౌలిక విషయాలపైనే దాడికి పూనుకుంటున్నాయి.
నయా ఉదారవాదాన్ని సమర్ధించే వారు జిడిపి వృద్ధిరేటు చూసి సంబరపడిపోవడం కాస్త ఆపి...ప్రజల జీవితాలు ఏవిధంగా ఆ విధానాల వలన దిగజారిపోతున్నాయో పరిశీలించాలి. ఆధునిక భారతదేశం నిర్మాణం జరగాలంటే అందుకు ఏ మూల సూత్రాలు అత్యంత ఆవశ్యకమో, వాటిపైనే నయా ఉదారవాద విధానాలు దాడి చేస్తున్న వైనాన్ని గమనించాలి.
(స్వేచ్ఛానుసరణ)
ప్రభాత్ పట్నాయక్











