May 22,2022 11:27

రెండుకాళ్ల బతుకుబండి
ఆకలి తీరాలంటే..
మూడుగారెల ఆటోబండిని నడపాల్సిందే.
ఎదలో రగులుతున్న
కష్టాల కుంపటి ఆరాలంటే..
రక్తాన్ని ఇంధనముగా చేసి
ముందుకు పోవాల్సిందే.
ప్రయాణికులే అతడికి ప్రపంచం..
యాభై రూపాయల బేరం
ముప్పై రూపాయలకు కుదిరినా..
పొంగుతున్న ఆశలమీద
వాన కురిసినట్లు..
మనసు నిమ్మలం చేసుకొని పరుగెడుతాడు

రోడ్లన్నీ విశాలమైన హృదయంలా పరుచుకొని..
అతడి రాకకోసం ఎదురుచూస్తుంటాయి.
నగర వీధులన్నీ అతడు మోగించే..
ఆటో సైరన్‌ చప్పుళ్లతో మారుమోగుతుంటాయి.
ఇద్దరో ముగ్గురో ప్యాసింజర్లు కనిపించారంటే..
ప్రపంచాన్ని జయించినట్లు.. సప్తమముద్రాల బాధల్ని
దాటినట్లు ఫీలౌతుంటాడు.
గల్లీలన్నీ గస్తీతిరిగి.. ఏ చెట్టునీడనో సేదతీరుతూ..
అచ్చిన పైసల్ని లెక్కేస్తూ...
పరివారపు
స్వప్నాల్ని కలగంటూ కాలం ఎల్లదీస్తాడు.
పల్లె ప్రజల్ని పట్టణానికి చేరవేస్తూ
రంగుల సీతాకోకచిలుక
స్వేచ్ఛగా ఎగురుతున్నట్లు..
ప్రేమగా మమకారపు మాటలు చెబుతూ
గమ్యాన్ని చేరుస్తాడు..
గుండెల్లో దాగిన బాధల బరువుల్ని ఎదుర్కొంటూ
దూరభారాల్ని దాటుతుంటాడు..
వీధులన్నీ అతగాడి ప్రాణస్నేహితులే..
సూర్యోదయాన ప్రకాశిస్తున్న రవికిరణాల్లా..బయలుదేరి.. నగరవీధులన్నింటినీ పలకరిస్తాడు..
ఏరు.. ఆటో అని పిలవగానే..
గంపెడు ఆశలతో
రెక్కలొచ్చిన పక్షిలా వాలిపోతాడు.

చమురు మంటలన్నీ
జీవితాన్ని దహిస్తున్నా..
బతుకుపాటనొకటి అందుకొని..
ఒంటినిండా గంపెడు ధైర్యాన్ని నింపుకొని
జనారణ్యంలోకి దూసుకుపోతాడు..
పాలపొంగుల్లా పొంగుతున్న ఆశలపై
కన్నీళ్లను చల్లుకొని...
కోరికల గొంతును
అందనంత ఆకాశానికి మూడేసుకొని..
మూడుచక్రాల పాదాలతో యుద్ధానికి బయలుదేరుతాడు.
బతకాలంటే యుద్ధం తప్పదు మరి..
పొట్టకోసం రెపరెపలాడే రెక్కలతో
కాలంతో కలిసి ప్రయాణం చేస్తాడు.

 

అశోక్‌ గోనె
94413 17361