ప్రజాశక్తి - ఆరిలోవ : ముడసర్లోవ రిజర్వాయర్ క్యాచ్‌మెంట్‌కు చెందిన స్థలాల పరిరక్షణకు ప్రతిపాదనలు సిద్ధంచేసినట్టు నగర మేయర్ గొలగాని హరి వెంకటకుమారి తెలిపారు. జివిఎంసి ఇంజినీరింగు అధికారులతో కలిసి ముడసర్లోవ రిజర్వాయర్ పరిసర ప్రాంతాల్లో రక్షణ గోడ నిర్మించేందుకు సిద్ధం చేసిన ప్రాజెక్టు నివేదికను మంగళవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, ముడసర్లోవ రిజర్వాయర్‌కు చెందిన స్థలాలు అన్యాక్రాంతం కాకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు సుమారు రూ.9 కోట్లతో 7 కిలోమీటర్ల రక్షణ గోడ నిర్మించుటకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, త్వరలో శంకుస్థాపన కూడా చేస్తామని తెలిపారు. సుమారు రూ.200 కోట్లతో ముడసర్లోవ పార్కును అంతర్జాతీయ పార్కుగా అభివృద్ధి చేసేందుకు ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేశామని చెప్పారు. ఈ పార్కులో బయో డైవర్సిటీ, మియావాకి, హెర్బల్, బటర్‌ఫ్లై పార్కులను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ముడసర్లోవ రిజర్వాయర్ ఆయకట్టు సుమారు 836.38 ఎకరాలు ఉందన్నారు. దీనిలో బిఆర్‌టిఎస్ రోడ్డుకు 97 ఎకరాలు, గోల్ఫ్ క్లబ్‌కు 112, అటవీశాఖ, పోర్టు ట్రస్టుకు 120, రైల్వేకు 52, విద్యుత్, ఎస్సీ, ఎస్టీ కాలనీలకు 120 ఎకరాలు కేటాయింపులు జరిగాయని వివరించారు. మిగిలిన 286 ఎకరాల వాటర్ క్యాచ్ మెంట్ ప్రాంతం అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. అనంతరం 11వ వార్డు పరిధి పినాకిల్ ఆసుపత్రి పక్కన గల సుమారు రెండు ఎకరాల ఖాళీగా ఉన్న స్థలాన్ని సర్వే చేసి చుట్టూ రక్షణ గోడ నిర్మించి, రెండు ప్రధాన గేట్లు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఇంజినీరింగు, టౌన్‌ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వాహక ఇంజినీర్ (ప్రాజెక్ట్) వి.వెంకటేశ్వరరావు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కిలాని దిలీప్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, సిబ్బంది పాల్గొన్నారు.










