
ప్రజాశక్తి - ఆరిలోవ : ముడసర్లోవ పార్కు ఆధునికీకరణకు ప్రణాళికలు సిద్ధం చేయాలని జివిఎంసి కమిషనర్ సిఎం సాయికాంత్‌వర్మ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన క్లేత్రస్థాయి పర్యటనలో భాగంగా ముడసర్లోవ పార్కును సందర్శించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ముడసర్లోవ పార్కును సందర్శకుల కోసం ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. పార్కులో పిచ్చి మొక్కలను తొలగించాలని అధికారులను ఆదేశించారు. మొక్కలకు రక్షణగా వేసిన గ్రిల్స్ పాడైనందున వాటిని మెకానికల్ విభాగపు అధికారులకు అప్పగించాలని డిడిహెచ్ దామోదరావును ఆదేశించారు. రామకృష్ణాపురంలో ఓపెన్ డ్రైన్ నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని పర్యవేక్షక ఇంజినీరు శ్యాంసన్ రాజును ఆదేశించారు. రామకృష్ణాపురం పరిసర ప్రాంతాల్లో పారిశుధ్య పనుల్లో నిర్లక్ష్యం వహించరాదని, ఏరోజు చెత్త ఆరోజు తరలించాలని ప్రజా ఆరోగ్యపు అధికారులకు ఆదేశించారు. ఈ పర్యటనలో జెడ్సీ కనక మహాలక్ష్మి, కార్యనిర్వాహక ఇంజినీరు మత్స్యరాజు, ఎఎంఒహెచ్ డాక్టర్ కిషోర్, డిఇ వంశీ తదితరులు పాల్గొన్నారు.