ప్రజాశక్తి - వినుకొండ : వరికపూడిసెల ప్రాజెక్టు నిర్మాణానికి మూడవ శిలాఫలకం వద్దని నేరుగా పనులు ప్రారంభించాలని ప్రాజెక్టు సాధన సమితి నాయకులు డిమాండ్ చేశారు. మండల కేంద్రమైన బొల్లాపల్లిలోని తహశీల్దార్ కార్యాలయం వద్ద ఏపీ రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, గిరిజన సంఘం, వరికపూడిశెల ప్రాజెక్టు సాధన సమితి ఆధ్వర్యంలో బుధవారం సదస్సు నిర్వహించారు. సదస్సుకు బొల్లాపల్లి మండలంలోని అనేక గ్రామాల నుండి రైతులు, వ్యవసాయ కూలీలు హాజరయ్యారు. రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల పల్నాడు జిల్లా కార్యదర్శులు ఏపూరి గోపాలరావు, ఎ.లకీëశ్వరరెడ్డి గిరిజన సంఘం నాయకులు వి.కోటనాయక్, సాధన సమితి నాయకులు రూబిన్, భూక్య రాంజీ తదితరులు మాట్లాడారు. పల్నాడు ప్రాంతంలోని వెల్దుర్తి, దుర్గి, బొల్లాపల్లి మండలాలతో పాటు ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలంలోని సుమారు లక్షకు పైగా ఎకరాలకు సాగునీరు, ఆయా గ్రామాలకు శాశ్వత తాగునీరు అందించే వరికపూడిశెల ప్రాజెక్టు కోసం 40 ఏళ్లకు పైగా ఈ ప్రాంత ప్రజలు పోరాటం చేస్తున్నట్లు చెప్పారు. ఎన్నికల ముందు ఓట్ల కోసం వాగ్దానాలు చేసిన వారు గద్దెనెక్కాక ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారని విమర్శించారు. గతంలో చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రులగా వరికెపూడిశెల నిర్మాణం అంటూ శిలాఫలకాలను ఆవిష్కరించినా పనులు మాత్రం చేయలేదని, గత టిడిపి ప్రభుత్వం రూ.320 కోట్లు కేటాయించినట్లు చెప్పినా అప్పుడూ పనులు చేపట్టలేదని గుర్తు చేశారు. తాము అధికారంలోకి రాగానే వరికపూడిశెల చేపడతానని ఎన్నికలకు ముందు హామీనిచ్చిన జగన్‌మోహన్‌రెడ్డి సిఎం అయ్యాక నాలుగేళ్లు అటవీ, పర్యావరణ శాఖల అనుమతుల పేరుతో పబ్బం గడిపారని, తిరిగి ఎన్నికలు ముంచుకురావడంతో అధికార పార్టీ నేతలకు ఈ ప్రాజెక్టు మళ్లీ గుర్తొచ్చిందని విమర్శించారు. అటవీ, పర్యావరణం, వన్యప్రాణుల సంరక్షణ శాఖల నుండి అనుమతులు వచ్చాయంటూ బూటకపు ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. రిజర్వ్ ఫారెస్ట్ నుండి పులుల అభయారణ్యం అనుమతులకై స్టాండింగ్ కమిటీ చర్చల అనంతరం సిఫారసు చేసేందుకు కొన్ని షరతులతో లోబడి ఉన్న నిర్ణయాన్ని పంపించారుగాని ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర నుండి అనుమతులు రాలేదని తెలిపారు. ఢిల్లీలో రైతులు 13 నెలలు ఎండ, వాన, చలిని తట్టుకుంటూ నల్ల చట్టాలను తిప్పికొట్టారని, ఆ స్ఫూర్తితో వరికపూడిశెల సాధన కోసమూ ఈ ప్రాంత రైతులు పోరాడాలని పిలుపునిచ్చారు. స్టాండింగ్ కమిటీ సిఫార్సులు తప్ప అనుమతులు లభించని వరికపూడిశెల ప్రాజెక్టుపై తప్పుడు ప్రచారాలు మానుకొని రాష్ట్ర బడ్జెట్లో నిధులు కేటాయించి ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు కె.హనుమంత్‌రెడ్డి, సిపిఐ నాయకులు వెంకటేశ్వర్లు, జనసేన నాయకులు హనుమాన్ నాయక్, బీఎస్పీ నాయకులు మన్నయ్య పాల్గొన్నారు.
వరికపూడిశల సాధన సమితి ఎన్నిక..
ఈ సందర్భంగా వరికపూడిశల సాధన సమితి మండల కమిటీని ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా దామెర వెంకటరమణారావు, అధ్యక్షులు భూక్యరాంజీ నాయక్, ప్రధాన కార్యదర్శిగా మేడం లక్కిరెడ్డి, ఉపాధ్యక్షులుగా పులిమర్ల రూబెన్, సహాయ కార్యదర్శిగా వి.కోటనాయక్, కోశాధికారిగా అట్లూరి గాలిరెడ్డి, 70 మంది సభ్యులు ఎన్నికయ్యారు.










