Jul 13,2023 22:44

ప్రజాశక్తి-పిఠాపురం మండలంలోని గోకివాడ గ్రామంలోని అక్కినీడి వారి చెరువుకు పుట్టకుంట కాలువపై అధికారులు తొలగించిన షట్టర్లు తిరిగి ఏర్పాటు చేయాలని రైతులు చేస్తున్న రిలే నిరాహారదీక్ష గురువారం మూడో రోజుకు చేరుకుంది. ఈ దీక్షలో గ్రామ రైతులు కె.స్వామి, వి.పద్దరాజు, వి.సుబేదు, కె.వెంకటరావు, కె.నారాయణమూర్తి ఉన్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ అధికారులు తమ గ్రామంలో ఉన్న చెరువుకు నీరు వెళ్ళే కాలువ పైన ఉన్న షటర్లు అధికారులు తొలగించడంతో తమ గ్రామంలోని పంటలకు నీరందాక పంట నష్టపోతామన్నారు. అధికారులు ప్రజా ప్రతినిధులు స్పందించి తొలగించిన షట్టర్లు తిరిగి ఏర్పాటుచేసి తమ గ్రామంలోని పంట పొలాలకు సాగునీరు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ జి.సత్యానందం, కె.బుజ్జి, ఎన్‌.రమేష్‌, జి.వెంకటరమణ, కె.పవన్‌ పలురువు రైతులు పాల్గొన్నారు.