Oct 19,2023 22:27

ప్రజాశక్తి-ఏలేశ్వరం ఎపి బార్‌ కౌన్సిల్‌ ఏకగ్రీవ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రత్తిపాడు న్యాయవాదులు మూడవరోజు విధులు బహిష్కరించి కోర్ట్‌ ఆవరణలో నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ప్రత్తిపాడు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు చిట్టంశెట్టి పుల్లయ్య మాట్లాడుతూ బార్‌ అసోసియేషన్లను సంప్రదించకుండా వెల్ఫేర్‌ స్టాంపులను రూ.1 నుంచి రూ.20 వరకూ పెంచడం అమానుషమన్నారు. రోజూ నాలుగైదు కక్షిదారుల తరపున మెమొలు దాఖలు చేయవలసి ఉంటుందని, ఇందువల్ల న్యాయవాదులు నష్టపోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా బార్‌ కౌన్సిల్‌ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్‌ కార్యదర్శి బి.మధుబాబు, గౌరవాధ్యక్షుడు చెలంకూరి రామకృష్ణ, ఎం.గంగాధర్‌, కోశాధికారి జొన్నాడ రాజేష్‌, లింగంపల్లి శివకుమార్‌, న్యాయవాదులు కిలపర్తి శ్రీనివాస్‌, రాజాల చిట్టిబాబు, రమణం వెంకట్రావు, పిల్లి బలరాముడు, మాదాల రవి, పలివెల నాగేంద్రరాజు ఉన్నారు.