
కలెక్టర్ పి.ప్రశాంతి
ప్రజాశక్తి - భీమవరం
మూడో దశ రీ సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ పి.ప్రశాంతి ఆదేశించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం వీడియో కాన్ఫరెన్స్ హాలు నుంచి వైఎస్‌ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు, భూ రక్ష పథకం, రీ సర్వే ప్రక్రియ, ఇతర అంశాలపై డివిజన్, మండల స్థాయి అధికారులతో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.రామ్‌సుందర్‌రెడ్డితో కలిసి శుక్రవారం కలెక్టర్ ప్రశాంతి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైఎస్‌ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం కింద రీ సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని, ఇబ్బందులు తలెత్తితే జిల్లా కార్యాలయానికి తెలియజేసి సరి చేసుకుని ముందుకు సాగాలన్నారు. జిల్లాలో మొదటి, రెండో రీ సర్వే ప్రక్రియలు విజయవంతంగా జరిగాయని, ఇదే స్ఫూర్తితో మూడో దశ పనులు పూర్తి చేయాలని చెప్పారు. ఆయా గ్రామాల్లో అధికారులు, సిబ్బంది సమన్వయంతో రీ సర్వే పనులు పూర్తి చేయాలన్నారు. ఈ సర్వే పూర్తయిన గ్రామాల్లో స్టోన్ ప్లాంటేషన్ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలన్నారు. నిర్దేశిత గడువులోగా రీ సర్వే కింద అన్ని రకాల ప్రక్రియలను పూర్తి చేయాలని, ఈ విషయమై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వ భూములు, గ్రామ కంఠం భూములు సర్వే చేసి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆస్తి అనుభవిస్తున్న వారికి యాజమాన్య హక్కు పత్రాలు పంపిణీ చేయాలన్నారు. జిల్లాలో జాతీయ రహదారుల నిర్మాణానికి అవసరమైన చోట్ల స్థల సేకరణ పూర్తి చేసుకుని పరిహారం నగదు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమస్యలు ఉన్నచోట్ల ప్రభుత్వ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుని పనులు వేగవంతం చేయాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా పంచాయతీ శాఖ అధికారి జివికె.మల్లికార్జునరావు, జిల్లా సర్వే అధికారులు కె.జాషువా, జిల్లా సివిల్ సప్లై అధికారి ఎన్.సరోజ, కలెక్టర్ కార్యాలయం ఎఒ అప్పారావు, ఎఎస్‌ఒ ఎం.రవిశంకర్, భూ సేకరణ తహశీల్దార్ సిహెచ్.రవికుమార్ పాల్గొన్నారు.