రాయచోటి : ముదివేడు బాలెన్సింగ్ రిజర్వాయర్ ముంపు బాధితులకు సహాయ పునరావాస చర్యలను వేగవంతం చేయాలని కలెక్టర్ గిరీష పి.ఎస్ అధికారులను ఆదేశించారు. మంగళవారం రాయచోటి కలెక్టరేట్‌లోని మినీ వీడియో కాన్ఫరెన్స్ హాలులో ముదివేడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, మంగంపేట నిర్వాసితులకు ఆర్‌అండ్‌ఆర్ అంశంపై జెసి ఫర్మన్ అహ్మద్ ఖాన్‌తో కలిసి డిఆర్‌ఒ, ఆర్‌డిఒ, ఎన్‌డిసి, ఇరిగేషన్, ఆర్‌అండ్‌బి, ఆర్డబ్ల్యుఎస్, పిఆర్, విద్యుత్, హౌసింగ్, వైద్య, దేవాదాయ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ముదివేడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిమిత్తం కురబలకోట మండలంలో శెట్టివారిపల్లి, నేతాజీ నగర్, కొత్తపల్లి అలాగే బి.కొత్తకోట మండలంలో దిన్నమీదిపల్లి, చవటకుంటపల్లి తదితర ఐదు గ్రామాలు ముంపునకు గురికానున్నాయని తెలిపారు. కురబలకోటకు సంబంధించి ముదివేడు క్రాస్‌లో, బి కొత్తకోటకు సంబంధించి కాండ్లమడుగు క్రాస్‌లో పునరావాస కాలనీలు ఏర్పాటు చేస్తామని సదరు గ్రామాల ముంపు బాధితులకు గుర్తించిన పునరావాస లే అవుట్‌లలో వేగవంతంగా పునరావాస చర్యలు చేపట్టాలని సూచించారు. పునరావాస నిమిత్తం త్వరితగతిన అంచనా వివరాలు రూపొందించాలన్నారు. ఇందుకు సమగ్ర ప్రతిపాదనలు రూపొందించి వెంటనే సమర్పించాలన్నారు. ఆయా మండలాలలో గ్రామ సభను నిర్వహించి ముంపు వాసుల జాబితాను రూపొందించాలని పేర్కొన్నారు. కొత్తగా ప్రతిపాదిస్తున్న లేఔట్లలో ఇళ్ల నిర్మాణం, రహదారులు, కాలువలు, నీరు, విద్యుత్ సౌకర్యాలు తదితర మౌలిక వసతులు కల్పించుటకు సంబంధిత శాఖల అధికారులు అంచనా ప్రతిపాదనలను సమర్పించాలని ఆర్‌అండ్‌బి, ఆర్డబ్ల్యుఎస్, పిఆర్, విద్యుత్, హౌసింగ్, వైద్య, దేవాదాయ శాఖల అధికారులను ఆదేశించారు. మంగంపేట ఆర్ అండ్ ఆర్ అంశానికి సంబంధించి సమీక్షిస్తూ కాపుపల్లి, దళితవాడ గ్రామాల వారికి మంగంపేట వద్ద పునరావాసం కోసం లేఅవుట్‌ను త్వరగా నిర్మించాలని హౌసింగ్ అధికారులను ఆదేశించారు. లేఅవుట్ పూర్తయిన వెంటనే అక్కడ మౌలిక వసతులు కల్పనకు ఆయా శాఖలు త్వరితగతిన స్పందించి చర్యలు తీసుకోవాలని చెప్పారు. సహాయ పునరావాస కార్యక్రమాలను వేగవంతం చేసి సదరు నిర్వాసితులను త్వరగా తరలించాలన్నారు. అనంతరం వివిధ అంశాలపై సమీక్షించి తగు సూచనలు జారీ చేశారు. సమావేశంలో డిఆర్‌ఒ సత్యనారాయణ, మదనపల్లి ఆర్‌డిఒ మురళి, ఎస్‌డిసి, ఆయా మండలాల తహశీల్దార్లు, ఆర్‌అండ్‌బి, ఆర్డబ్ల్యుఎస్, పిఆర్, విద్యుత్, హౌసింగ్, వైద్య, దేవాదాయ శాఖల అధికారులు పాల్గొన్నారు.










