Sep 21,2023 20:48

సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ గిరీష

 రాయచోటి : జిల్లాలోని ముదివేడు రిజర్వాయర్‌ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ భూసేకరణ పనులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్‌ గిరీష, సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని మినీ వీడియో కాన్ఫరెన్స్‌ హాలులో ముదివేడు లిఫ్టు ఇరిగేషన్‌ ప్రాజెక్టు భూసేకరణ, సహాయ పునరావాస కార్యక్రమాలపై సంబంధిత అధికారులతో కలెక్టర్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని ముదివీడు రిజర్వాయర్‌ పరిసర ప్రాంతాలకు సంబంధించి సాగు, తాగునీటి సమస్యలు పరిష్కరించేందుకు చేపట్టిన ముదివేడు బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ భూసేకరణను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ రిజర్వాయర్‌ నిమిత్తం ముంపునకు గురయ్యే గ్రామాల బాధితుల పునరావాస లేఔట్లలో వేగంగా మౌలిక వసతులు కల్పించాలన్నారు. ముదివేడు రిజర్వాయర్‌కు సంబంధించిన భూ సేకరణపై నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. అవార్డ్స్‌ పాస్‌ చేసిన భూమికి సంబంధించి లబ్ధిదారులకు త్వరగా పరిహారం పంపిణీ పూర్తి చేయాలన్నారు. ఈ సందర్భంగా ఇంకా చేయాల్సిన భూసేకరణలో ప్రభుత్వ భూమి, పట్టా భూమి, డీకేటి, అసైన్మెంట్‌ భూముల వివరాలను ఆయా తహశీల్దార్లను అడిగి తెలుసుకున్నారు. పట్టా భూములకు సంబంధించి ఫామ్‌- సిలో నివేదిక సమర్పించాలన్నారు. సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మన్‌ అహ్మద్‌ ఖాన్‌, డిఆర్‌ఒ సత్యనారాయణ, మదనపల్లి ఆర్‌ర్‌డిఒ మురళి, పంచాయతీరాజ్‌ ఎస్‌ఇ కష్ణమూర్తి, ల్యాండ్‌ అండ్‌ సర్వే ఏడీజయరాజు, తహశీల్దార్లు పాల్గొన్నారు.
రీ-సర్వే పకడ్బందీగా నిర్వహించాలి
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రీ-సర్వే కార్యక్రమాన్ని పకడ్బందీగా పూర్తి చేయాలని భూ పరిపాలన ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్‌ అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. గురువారం విజయవాడ సిసిఎల్‌ఎ కార్యాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లతో రీ-సర్వే పై భూ పరిపాలన ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా భూ పరిపాలన ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్‌ మాట్లాడుతూ డిసెంబర్‌ 31 నాటికి ఫైనల్‌ ఆర్‌ఒఆర్‌ఒ పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. రీసర్వే పూర్తయిన గ్రామాలలో హద్దు రాళ్లు నాటడం, భూహక్కు పత్రాల పంపిణీ పెండింగ్‌ లేకుండా చూడాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం భూ హక్కు పత్రాల పంపిణీకి సంబంధించి ప్రత్యేక దష్టి సారించిందని ఫేస్‌ -2 కింద పెండింగ్‌లో ఉన్న భూ హక్కు పత్రాలు పంపిణీ త్వరితగతిన పూర్తి చేసే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌ అనంతరం కలెక్టర్‌ గిరీష పిఎస్‌, మాట్లాడుతూ జిల్లాలో రెండవ దశ రీ సర్వే కార్యక్రమం పకడ్బందీగా పూర్తి చేసేందుకు సంబంధిత అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో ఫేస్‌-2 కింద పెండింగ్‌లో ఉన్న భూహక్కు పత్రాలు త్వరగా పూర్తి చేయాలన్నారు. భూహక్కు పత్రాల పంపిణీ నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. సర్వే పూర్తయిన గ్రామాల్లో హద్దురాళ్లను తప్పనిసరిగా పాతించాలన్నారు. ప్రణాళిక బద్ధంగా సరైన కార్యాచరణ రూపొందించుకొని, హద్దురళ్లు నాటే ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మన్‌ అహ్మద్‌ ఖాన్‌, జిల్లా రెవెన్యూ అధికారి సత్యనారాయణ, ల్యాండ్‌ అండ్‌ సర్వే ఏడీ జయరాజు పాల్గొన్నారు.