ప్రజాశక్తి - ముదినేపల్లి
రైతులను వాన కష్టాలు వదలడంలేదు. తుపాన్ ప్రభావంతో కురిసిన వర్షాలకు మండలంలో ఇప్పటికే రైతులు తీవ్రంగా నష్టపోయారు. వర్షాలు కాస్త తెరిపి ఇవ్వడంతో మిగిలిన పంటను కాపాడుకునే ప్రయత్నాల్లో రైతులు ఉన్నారు. ఈ దశలో శనివారం రాత్రి ఆకస్మాత్తుగా మండలంలోని పలు గ్రామాల్లో భారీగా వర్షం కురిసింది. దీంతో కోసిన పనలపై ఉన్న వరి పైరు తడిసిపోయింది. కల్లాల్లోకి వర్షపు నీరు వచ్చి చేరడంతో ధాన్యాపు రాసులు తడిశాయి. దీంతో ఆదివారం ఉదయన్నే ఉరుకులు, పరుగులు మీద రైతులు కల్లాలో నిలిచిన వర్షపు నీటిని బయటకు మళ్లించే పన్నుల్లో నిమఘ్నమయారు. తుపాన్ గండం గడచింది దేవుడా అనుకునే లోపు మళ్లీ భారీ వర్షం కురవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యం వర్షపు నీటికి తడిసిపోయింది. పంటలు చేతికి వచ్చే సమయంలో అకాల వర్షాలు తుపాన్ కారణంగా అన్నదాతలు ఊసూరుమంటున్నారు. మండలంలో ముమ్మరంగా వ్యవసాయ పనులు జరుగుతున్న తరుణంలో మళ్లీ కురిసిన వర్షం రైతులను కోలుకొని దెబ్బతీసిందని రైతులు అంటున్నారు. మండలవ్యాపంగా ఏడు వందల ఎకరాల్లో కోసిన వరిపైరు పనలపై ఉంది. దీనికి తోడు తేమ శాతం ఎక్కువగా ఉందనే సాకుతో అటు రైతులను మిల్లర్లు, అటు ఆర్‌బికె అధికారులు ముప్పతిప్పలు పెడుతున్నారు. ఒకపక్క వర్షం, మరోపక్క ధాన్యం కొనేందుకు అధికారులు పెట్టే నిబంధనలతో రైతులు లబోదిబోమంటున్నారు. వాతావరణంలో మార్పులు, శీతాకాలం కావడంతో ధాన్యం ఆరేందుకు వారాలు సమయం పడుతుంది. ఈ లోగా మళ్లీ వర్షం పడడంతో రైతులు పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నిబంధనలు సడలించి తడి, పొడి ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని మండలంలోని రైతాంగం ప్రభుత్వాన్ని కోరుతోంది.










