Oct 08,2023 16:29

ఇబ్బందులు పడుతున్న ప్రజలు
పట్టించుకోని అధికారులు
ప్రజాశక్తి - ముదినేపల్లి
    మండలంలోని పలు గ్రామాల్లో డ్రెయినేజీలపై నిర్మించిన పలు వంతెనలు శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా మారాయి. ప్రజలు, రైతులు వాహనాల రాకపోకలు సాగించే నిమిత్తం ఈ వంతెనలు నిర్మించారు. అయితే కాలక్రమేణా ఈ వంతెనలు పూర్తిగా శిథిలావస్థకు చేరాయి. దీంతో ఎప్పుడు కూలి ప్రమాదం సంభవిస్తుందోననే భయం ప్రజలను వెంటాడుతోంది. ఈ వంతెనపై ప్రయాణం చేసే జనం ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని ప్రయాణం సాగిస్తున్నారు.
ప్రమాదకరంగా వంతెనలు
గుడివాడ - బంటుమిల్లి రోడ్డులో మండలంలోని ఉప్పరగూడెం మలుపు వద్ద పెదలంక మేజర్‌ డ్రెయినేజీపై నిర్మించిన పురాతన వంతెన శిథిలావస్థకు చేరింది. ఈ వంతెన నిర్మించి 65 ఏళ్లు అయ్యింది. గుడివాడ - బంటుమిల్లి మీదుగా మచిలీపట్నం వెళ్లే ప్రధాన రహదారిలో ఈ వంతెన ఉంది. నిత్యం ఈ వంతెనపై వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తాయి. ఎంతో ప్రాధాన్యత ఉన్న వంతెన గోడలు బీటలు వాలి, రెయిలింగ్‌ పడిపోయి ప్రమాదభరితంగా ఉంది. రెయిలింగ్‌ లేకపోవడంతో గతంలో పలువురు ద్విచక్ర వాహనదారులు రాత్రి సమయాల్లో డ్రెయినేజీలో పడి మృతి చెందారు. ఈ వంతెన ఇరుకు కావడంతో రెండు వాహనాలు తప్పుకునే అవకాశం లేదు. ఈ వంతెన ఎప్పుడు కూలిపోతోందోననే భయం ఈ ప్రాంత వాసులను వెంటాడుతోంది. ఈ వంతెనపై నుంచి నిత్యం ముదినేపల్లిలోని వివిధ విద్యాసంస్థలకు వందలాది మంది విద్యార్థులు స్కూల్‌ బస్సుల్లో ప్రయాణం చేస్తుంటారు. అలాగే ఇదే డ్రెయినేజీపై ఈడేపల్లి - దేవపూడి గ్రామాల మధ్య నిర్మించిన కాలిబాట వంతెన కూడ శిథిలావస్థకు చేరి, ఏ క్షణానైనా కూలేందుకు సిద్ధంగా ఉంది. ఈ వంతెన రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంది. అంతేకాక ఈడేపల్లి, అల్లూరు బొమ్మినంపాడు, కొరగుంటపాలెం గ్రామాలకు వెళ్లే ప్రజలకు దగ్గర మార్గంగా ఉంది. ఈ వంతెన కూడా శిథిలావస్థకు చేరింది. ఏ క్షణానైనా కూలిపోవచ్చు.
కూలిన పేరూరు, దేవరం వంతెనలు
దాకరం - పుట్లచెరువు రహదారిలో మండలంలోని పేరూరు వద్ద పోల్‌రాజ్‌ డ్రెయినేజీపై నిర్మించిన పురాతన వంతెన కుప్పకూలింది. ఈ వంతెన కూలి రెండు ఏళ్లు అయినా నేటికీ అధికారులు నూతన వంతెన నిర్మాణం చేపట్టలేదు. దీంతో ఈ రహదారిలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. గ్రామ పంచాయతీ సర్పంచి స్పందించి ప్రజలు, రైతులు రాకపోకలు సాగించేందుకు తాత్కాలికంగా కాలిబాట వంతెన నిర్మాణం చేశారు. అలాగే అన్నవరం - దేవరం గ్రామాల మధ్య అన్నవరం డ్రెయినేజీపై నిర్మించిన వంతెన కూడా గత ఏదాది కూలిపోయింది. దీంతో రెండు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఆక్వా రైతులంతా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తాము పండించిన ఆక్వా ఉత్పత్తులను గ్రామం నుంచి బయటకు తీసుకువెళ్లేందుకు గాను డ్రెయినేజీలో తూములు ఏర్పాటు చేసి రహదారి సౌకర్యం ఏర్పాటు చేసుకున్నారు.
పట్టించుకోని అధికారులు
మండలంలోని పలు డ్రెయినేజీలపై నిర్మించిన వంతెనలు శిథిలావస్థకు చేరి, ప్రమాదకరంగా ఉన్నా అధికారులు మాత్రం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహారిస్తున్నారని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. వంతెనలు కూలి, ప్రమాదం జరిగి, ప్రజల ప్రాణాలు గాలిలో కలిస్తే తప్ప అధికారులకు చలనం రాదేమోనని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నిధులు విడుదల కోసం చూస్తున్నాం
డ్రెయినేజీ ఎఇ రాజ్‌కుమార్‌
నియోజకవర్గంలో 15 వరకు వంతెనలు శిథిలావస్థకు చేరాయి. వీటిలో 10 వంతెనల వరకు డ్రెయినేజీ శాఖకు సంబంధించిన కాగా, మిగతావి ఆర్‌అండ్‌బి శాఖ పరిధిలో ఉన్నాయి. మండలంలోని అన్నవరం - దేవరం, గురజ - మానికొండపాడు, ఈడేపల్లి - దేవపూడి గ్రామాల మధ్య శిథిలావస్థకు చేరిన వంతెనల నిర్మాణానికి ప్రభుత్వానికి ప్రాతిపాదనలు పంపాం. గాని ఇంతవరకు నిధులు మంజూరు కాలేదు. ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు కాగానే పలు డ్రెయిన్లపై శిథిలావస్థకు చేరిన వంతెనల స్థానంలో నూతన వంతెనలు నిర్మాణం చేపట్టడం జరుగుతుందని ప్రజాశక్తికి వివరణ ఇచ్చారు.
ఇప్పటికైనా ఆర్‌అండ్‌బి అధికారులు, డ్రెయినేజీ అధికారులు స్పందించి కాలం తీరినా, శిథిలావస్థకు చేరిన వంతెనల స్థానంలో నూతన వంతెనలు నిర్మాణం చేసి, ప్రజల ప్రాణాలు కాపాడాలని మండల ప్రజలు ముక్త కంఠంతో కోరుతున్నారు.