Aug 05,2023 00:18

ఆవలో ఉన్న మత్స్యకారులు

ప్రజాశక్తి-రోలుగుంట:మూడేళ్లుగా సంపూర్ణంగా చేపల వేట లేక మత్స్యకారులు నష్టపోతున్నారు. మండలంలో కొమరవోలు ఆవతో పాటు కల్యాణపులోవ, మరికొన్ని చెరువులలో 200 మంది మత్స్యకారులు వేటను సాగిస్తుంటారు. ఈ మండలానికి చెందిన కొమరవోలు ఫిషర్‌మెన్‌ సొసైటీకి చెందిన మత్స్యకారులు జీవనం సాగించేవారు. మూడేళ్లుగా ఈ కొమరవోలు ఆలో నీరు రైతులు రెండవ పంటకు వినియోగించ లేదు.. దీంతో, నీటి ప్రవాహం తగ్గలేదు. దీంతో, చేపలు పట్టేందుకు అనుకూలంగా లేదు. ఈ కారణంగా, చేపల వేట జరగ లేదు. నీరు తగ్గితే మార్చి, ఏప్రిల్‌ తేదీ వరకూ సంపూర్ణంగా చేపల వేట జరిగేది. దీనిపై ఆధారపడి ఉన్న 200 కుటుంబాల వారు జీవనం సాగించేవారు. ఈ మూడేళ్ల నుండి జనవరి, ఫిబ్రవరి మాసాలలో మిగతా చెరువులో వేటాడేవారు. గతంలో కల్యాణపులోవలో కూడా వేటాడేవారు. కల్యాణపులోవలో స్థానికులైన షెడ్యూల్‌ తెగల వారు కోర్టుకు వెళ్లడంతో దానిలో వేట నిలిపివేశారు. ఆ కారణంగా రెండు విధాలా నష్ట పోయారు. ఉన్న కొమరవోలు ఆవ నీరు పూర్తిగా ఉండటంతో వేట జరగలేదు. ఇలా మూడేళ్ల నుండి కొమరవోలు ఫిషర్‌మెన్‌ సొసైటీకి చెందిన రోలుగుంట, కంచుగుమ్మల, కొమరవోలు గ్రామాలకు చెందిన గూళ్ల జాతి (మత్స్యకారులు) వారు ప్రభుత్వానికి లీజు చెల్లింపుల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతీ ఏడాది చేప పిల్లలు 2లక్షల రూపాయలు విలువ చేసే పిల్లలను ఆగస్టు నెలలో వేస్తారు. దీంతో వారు నష్టపోతున్నారు. జిల్లా అధికారులు స్పందించి వారికి న్యాయం చేయాలని కోరుతున్నారు.