Jun 01,2022 06:47

రాష్ట్రంలో జగన్మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రభుత్వం ఏర్పడి మూడు సంవత్సరాలయింది. మూడేళ్ల జగన్‌ పాలన మంచి-చెడు తెలుసుకోడానికి ఈ కాలంలో ఆయన తీసుకున్న చర్యల్లో మచ్చుకు కొన్నిటిని పరిశీలిస్తే సరిపోతుంది. కోవిడ్‌ మహమ్మారి ముఖ్యమంత్రి పాలనా దక్షతకు ప్రత్యేకించి పరీక్ష పెట్టింది. ఆ విధంగా చూస్తే జగన్‌ ప్రభుత్వం అత్తెసరు మార్కులతో గట్టెక్కింది. సంక్షేమ రంగంలో గత ప్రభుత్వం కన్నా కొంత మెరుగనిపించినా, వలంటీర్ల వ్యవస్థను కొత్తగా నెలకొల్పడం ద్వారా ప్రజల వద్దకు పాలన కొంత చేరువ అయినా, మిగతా వాటిలో అనేక తప్పటడుగులు వేసింది. కొన్నిటిలో, వైఫల్యాలను మూటగట్టుకుంది. మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి చేసిన ట్వీట్‌లో 95 శాతం హామీలను నెరవేర్చామని చెప్పడం అతిశయోక్తే. సిపిఎస్‌ రద్దు, ప్రతి యేటా జనవరిలో జాబ్‌ కేలండర్‌, ఏడాదికోసారి డియస్సీ, యేటా 2.3 లక్షల ఉద్యోగాలు, ప్రతి సంవత్సరం 6,500 పోలీస్‌ ఉద్యోగాల భర్తీ, దశలవారీ మద్యపాన నిషేధం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌, 45 ఏళ్లు దాటిన మహిళలకు పింఛను వంటి హామీలు ఇప్పటికీ నెరవేరకుండా అలానే మిగిలి ఉన్నాయి. ప్రభుత్వం నెరవేర్చామని చెబుతున్న నవరత్నాలు, ఇతర సంక్షేమ పథకాలు కూడా అర్హులైనవారందరికీ చేరాయని గుండె మీద చెయ్యి వేసుకుని చెప్పగలిగే స్థితి లేదు. అమ్మ ఒడి వంటి పథకాలకు రకరకాల నిబంధనలు పెట్టి లబ్ధిదారుల సంఖ్యను కుదిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. ఇసుక పాలసీ ఓ పెద్ద ప్రహసనంగా మారింది. ఇసుక దొరక్క, దొరికినా రేట్లు అందుబాటులో లేక భవన నిర్మాణ రంగంలో చాలా కాలం స్తబ్ధత నెలకొంది. అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానుల వివాదం ఇంకో పెద్ద ప్రహసనం. గతంలో చంద్రబాబు 33 వేల ఎకరాలను ల్యాండ్‌ పూలింగ్‌ కింద సేకరించి సూపర్‌ రాజధాని కడతానంటూ గ్రాఫిక్స్‌తో ఊదరగొట్టారు. అమరావతిని కాస్తా భ్రమరావతిగా మార్చారు. తరువాత వచ్చిన జగన్మోహన్‌ రెడ్డి హైదరాబాద్‌ లేదా బెంగళూరు తరహాలో అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేస్తారని ఆశించిన వారికి నిరాశే మిగిల్చారు. మూడు రాజధానుల పేరుతో మూడేళ్ల విలువైన కాలాన్ని వృథా చేశారు. కార్పొరేట్లకు మేలు చేకూర్చే నయా ఉదారవాద ఆర్థిక విధానాలను శరవేగంగా అమలు చేయడంలో గత ప్రభుత్వాన్ని మించిపోయింది. విద్యుత్‌, పట్టణ సంస్కరణలను రాష్ట్రంలో అమలుజేయడంలో ఇతర బిజెపి పాలిత రాష్ట్రాలతో పోటీ పడుతున్నది. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్‌ అనుకూల వ్యవసాయ చట్టాలను తెచ్చినప్పుడు పార్లమెంటులో వాటికి అనుకూలంగా వైసిపి, టిడిపి కలసి ఓటువేశాయి. వ్యవసాయ రంగంలో ఉచిత విద్యుత్‌ను ఎత్తివేయడమే లక్ష్యంగా కేంద్రం తీసుకొచ్చిన విద్యుత్‌ సంస్కరణలను పొరుగున ఉన్న తమిళనాడు, తెలంగాణ వంటి రాష్ట్రాలు వ్యతిరేకించగా, జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం తగుదునమ్మా అంటూ వాటిని నెత్తికెత్తుకున్నది. సంస్కరణల పేరుతో ఆస్తిపన్ను దగ్గర నుంచి చెత్త పన్ను దాకా విద్యుత్‌ ఛార్జీల మొదలు ఆర్టీసీ చార్జీలు దాకా పెంచేసి ప్రజలపై ఎనలేని భారాలను మోపింది. రాష్ట్రంలోని కీలకమైన ఓడరేవులన్నిటినీ అదానీకి నైవేద్యంగా అర్పిస్తున్నది. 35 వేల మందికి ప్రత్యక్షంగా, మరో 65 వేల మందికి పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో నూరు శాతం వాటాను ప్రైవేట్‌కు అమ్మేందుకు కేంద్రంలో మోడీ ప్రభుత్వం తెగబడుతుంటే, దానికి వ్యతిరేకంగా గట్టిగా పోరాడిన దాఖలాలు లేవు. తనకు 25 మంది ఎంపీలను ఇస్తే కేంద్రం మెడలు వంచి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తామని చెప్పిన వైసిపి నేత ఈ మూడేళ్లలో దానిపై గట్టిగా అడిగింది లేదు. విభజన చట్టంలో పేర్కొన్నవిధంగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్రానిదే. ఈ ప్రాజెక్టు కోసం సర్వస్వం కోల్పోతున్న లక్షకు పైగా గిరిజన కుటుంబాలకు పునరావాసం కల్పించాల్సింది కూడా కేంద్రమే. అయినా, ఇది తన బాధ్యత కాదన్నట్టు కేంద్రం వ్యవహరిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం విన్నపాలు, వేడుకోళ్లతో సరిపెడుతున్నది. వ్యవసాయం, విద్య, విద్యుత్‌, పన్నులు వంటి రంగాల్లో రాష్ట్రాల హక్కులను కేంద్రం కబళిస్తుంటే, కేరళ, తమిళనాడు, తెలంగాణ, బెంగాల్‌ వంటి రాష్ట్రాలతో కలసి కేంద్రంపై పోరాడడానికి ఇష్టపడడం లేదు. ఆర్థిక విషయాల్లోనే కాదు, మిగతా అన్ని విషయాల్లోనూ రాష్ట్రానికి బిజెపి చేస్తున్న ద్రోహం అంతా ఇంతా కాదు. మైనార్టీలను అణచివేసేందుకు జాతీయ పౌరసత్వ నమోదు (సిఎఎ) చట్ట సవరణ బిల్లును మోడీ ప్రభుత్వం తీసుకొస్తే దానిని వైసిపి పార్లమెంటులో సమర్థించింది. కేంద్రంతో రాజీ పడే ఈ ధోరణి రాష్ట్రానికి తీరని నష్టం కలిగిస్తుంది. దీని నుంచి అది ఎంత త్వరగా విడగొట్టుకుంటే రాష్ట్రానికి అంత మంచిది.