Aug 18,2023 20:48

విలేకర్లతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు

ప్రజాశక్తి - వినుకొండ : రాష్ట్రంలో ముద్ద కోసం ఎదురుచూసే ప్రజలు లేరని, మండలానికి ఒక అన్నా క్యాంటీన్‌ పెట్టి ప్రజలను బిక్షగాళ్లలాగా చూడాల నుకోవటం చంద్రబాబుకు సరికాదని ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అన్నారు. స్థానిక వైసిపి కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. మండలానికి ఒక అన్న క్యాంటీన్‌ పెడతానని చంద్రబాబు చెబుతున్నారని, ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని, రోజువారి కూలీ రూ.500 వస్తోందని, మీరు పెట్టే ముద్ద కోసం ప్రజలు ఎవరూ ఎదురు చూడటం లేదని ఎద్దేవ చేశారు. టిడిపి అధికారంలోకి వస్తే రైతుకు రూ.20 వేలు ఇస్తానని హామీ ఇస్తున్న చంద్రబాబుకు టిడిపి పాలనలో ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. రైతు రుణమాఫీ చేస్తానని చెప్పి దగా చేశారని విమర్శించారు. ఆక్వా, చేనేత రైతులు అప్పుడు కనిపించలేదా అని ప్రశ్నించారు. రైతు ఆత్మహత్యలంటూ తప్పుడు రికార్డులు చూపిస్తున్నారన్నారు. పంట రుణాలు, ఇన్పుట్‌ సబ్సిడీలు పంటలకు మద్దతు ధర కల్పిస్తూ వైసిపి ప్రభుత్వం రైతులను ఆదుకుంటుందని అన్నారు. టిడిపి ప్రభుత్వ హయాంలో రైతులను ఆదుకోవడం చేతకాని చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే రైతులను ఎలా ఆదుకుంటారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. అనేక హామీలిచ్చి గతంలో మోసం చేసిన చంద్రబాబును ప్రజలు విశ్వసించే పరిస్థితిలో లేరని, ఈ విషయాన్ని ఆయన గుర్తించాలని అన్నారు.