Dec 22,2022 22:44

వైద్య శిబిరం నిర్వహిస్తున్న డాక్టర్‌ కోరాడ శైలజ

ప్రజాశక్తి -ఆనందపురం: ఆనందపురం మండలం ముచ్చర్ల గ్రామంలో పిహెచ్‌సి వైద్యాధికారి కోరాడ శైలజ ఆధ్వర్యాన ఫ్యామిలీ ఫిజీషియన్‌ కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్‌ శినగం ఎర్రయ్య కార్యక్రమాన్ని ప్రారంభించారు. వైద్య అధికారి డాక్టర్‌ కోరాడ శైలజ సుమారు 69 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. బాలింతలు, మధుమేహం, రక్తపోటు ఉన్నవారికి పరీక్షలు జరిపారు. గర్భిణులకు ఈసీజీ పరీక్షలు చేసి మందులు అందజేశారు. అనంతరం దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగుల ఇళ్లకు వెళ్లి వారు తీసుకుంటున్న చికిత్స, వాడుతున్న మందులు వివరాలు అడిగి తెలుసుకున్నారు. పలు సూచనలు, సలహాలు అందజేశారు. అంగన్‌వాడీ, పాఠశాలల్లో పిల్లల ఆరోగ్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ ఎర్రయ్య మాట్లాడుతూ, ప్రజలకు వైద్యం మరింత చేరువచేయాలనే తలంపుతో జగన్మోహన్‌రెడ్డి ఫ్యామిలీ ఫిజీషియన్‌ ప్రవేశపెట్టారని తెలిపారు. 14 రకాల పరీక్షలు, 67 రకాల మందులు అందుబాటులో ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో 104 వైద్యాధికారి డాక్టరు జి.ఆదిత్య, ఎంపిటిసి గుసిడి ముత్యాలు, సామాజిక ఆరోగ్య అధికారి పి.సాంబమూర్తి, ప్రసాదరావు, ఆరోగ్య పర్యవేక్షకులు టి.కల్యాణమ్మ, శ్యామ్‌, దేవి, ఆరోగ్య కార్యకర్తలు ఎస్‌.రాములమ్మ, సియాద్రి నరసింహమూర్తి, జ్ఞానేశ్వర్‌ రావు తదితరులు పాల్గొన్నారు.