ప్రజాశక్తి - కడియం, రాజమహేంద్రవరం రూరల్ మత్య్సకారుల ఆర్థికాభివృద్ధి కోసం ప్రత్యేక దృష్టి సారించినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ కె.మాధవీలత అన్నారు. మంగళవారం ప్రపంచ మత్య్స దినోత్సవం సందర్భంగా రాజమహేంద్రవరం రూరల్ మండలం ధవళేశ్వరంలోని కంచర్ల లైన్ రేవులో కడియం మత్య్స విత్తన క్షేత్రంలో ఉత్పత్తి చేసిన 29.83 లక్షల చేప పిల్లలను ఎంపి మార్గాని భరత్ రామ్‌తో కలిసి కలెక్టర్ విడుదల చేశారు. అలాగే 5 లక్షల స్కాంపి రొయ్య పిల్లలను గోదావరిలో విడుదల చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చేప, రొయ్య పిల్లల విడుదల వలన గోదావరిలో మత్స్య సంపద పెరుగుతుందని, గోదావరి పరివాహక ప్రజలు మంచి ప్రోటీన్ గల చేపలు, రొయ్యలు ఆహారం విరివిగా లభించుటకు అవకాశం లభిస్తుందని తెలిపారు. గోదావరి నదిపై చేపల వేట సాగిస్తున్న 5 వేల కుటుంబాలు ప్రత్యక్షంగా ఉపాధి పొందుతాయని తెలిపారు. చేపల మార్కెటింగ్ ద్వారా 3500 కుటుంబాలు పరోక్షంగా ఉపాధి పొందుతున్నాయని చెప్పారు. ఆక్వా రైతులకు ఒక యూనిట్ విద్యుత్తును రూ.1.50 పైసలకు ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుం దన్నారు. ఎంపి భరత్ రామ్ మాట్లాడుతూ మత్స్య పరిశ్రమ దినదినాభివృద్ధి చెందే ముఖ్యమైన పరిశ్ర మన్నారు. మత్స్య పరిశ్రమపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్య శాఖ అధికారి వి.కృష్ణారావు, అసిస్టెంట్ డైరెక్టర్ అఫ్ ఫిషరీస్ దిల్షాద్, రుడా మాజీ ఛైర్‌పర్సన్ మేడపాటి షర్మిల రెడ్డి, మత్య్సకార శాఖ అధికారులు పాల్గొన్నారు.