Sep 15,2023 21:34

ప్రజాశక్తి - ఏలూరు అర్బన్‌
            సనాతన ధర్మంపై ఉదయనిధి చేసిన వ్యాఖ్యలను వక్రీకరిస్తూ బిజెపి ప్రభుత్వం దేశంలో మతవిద్వేషాలను రెచ్చగొడుతుందని ఎంఎల్‌సి షేక్‌ సాబ్జీ విమర్శించారు. స్థానిక సిఐటియు జిల్లా కార్యాలయంలో శుక్రవారం కెవిపిఎస్‌ ఆధ్వర్యంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా సాబ్జీ విచ్చేశారు. కెవిపిఎస్‌ జిల్లా కార్యదర్శి ఎ.ఫ్రాన్సిస్‌ అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో ఎంఆర్‌పిఎస్‌, మాల మహాసేన నాయకులు, దళిత ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. అనంతరం సాబ్జీ మాట్లాడుతూ సనాతన ధర్మం గురించి తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ మాటలను వక్రీకరించి బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన స్వామీజీలు ఉదయనిధి తల నరికితే రూ.10 కోట్లు ఇస్తానని చేసిన వ్యాఖ్యలు భారత రాజ్యాంగాన్ని కించపరిచే విధంగా ఉన్నాయన్నారు. తలనరికి తెమ్మన్న స్వామీజీపై సుమోటా కేసు కట్టాలని, ఈ వ్యాఖ్యలను సమర్థించిన ప్రధానమంత్రి మతాలు రెచ్చగొడుతున్నారని, రాజ్యాంగం మీద ప్రమాణం చేసి పరిపాలన చేస్తానని చెప్పిన భారత ప్రధాని మతాలను రెచ్చగొట్టేవ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు. ప్రజలందరూ మతసామరస్యాన్ని పాటించాలని, మతఉన్మాదాన్ని వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు.
కెవిపిఎస్‌ జిల్లా కార్యదర్శి ఎ.ఫ్రాన్సిస్‌ మాట్లాడుతూ బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ ఎన్నికల సమయంలో ఇలాంటి అరాచకాలతో అధికారంలోకి రావాలని చూస్తుందని విమర్శించారు. గత ఎన్నికల సమయంలో బిజెపి ఇలాంటి జిమ్మిక్కులే చేసిందని, అధికారంలోకి వచ్చిన తర్వాత గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌ రేట్లు అత్యధికంగా పెంచి ప్రజలపై భారాలను మోపిందని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో కుల, మతపరమైన గొడవలు రెచ్చగొట్టి లబ్ధిపొందాలని చూస్తుందని, దళిత, ప్రజాసంఘాలు అభ్యుదయవాదులు బిజెపి కుయుక్తులను తిప్పికొట్టాలని ఫ్రాన్సిస్‌ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మహిళా నాయకురాలు మణిసింగ్‌, అజరు కుమార్‌, ఎం.ఇస్సాక్‌, బాలరాజు, ఎంఆర్‌పిఎస్‌ నాయకులు కందుల రమేష్‌, మాల మహాసేన జాతీయ అధ్యక్షులు ఎ.రవికుమార్‌, కె.రవికుమార్‌, జుజ్జవరపు రవిప్రకాష్‌, నాయక్‌, కెవిపిఎస్‌ నాయకులు యు.నిర్మల, కె.రాంబాబు పాల్గొన్నారు.