Aug 11,2023 18:38

ప్రజాశక్తి - కైకలూరు
     మత్తుపదార్థాలకు దూరంగా ఉండి, పిల్లలను చదివించి, గొప్పవారిగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని డాన్‌ బోస్కో నవజీవన్‌ బాలభవన్‌ నేతలు తెలిపారు. కోఆర్డినేటర్‌ టి.లీలావతి, సామాజికవేత్త ఎల్‌ఎస్‌.భాస్కరరావు, టి.అప్పారావులు శుక్రవారం కాలనీ వాసులతో మాట్లాడారు. డాన్‌ బోస్కో నవజీవన్‌ బాలభవన్‌ ఆధ్వర్యంలో కైకలూరు ఎస్‌టి (యానాదుల) కాలనీలో పిల్లలను చదివించటం, పిల్లల దుర్వినియోగం, గృహ హింస, మత్తు పదార్థాల దుర్వినియోగం, ప్రభుత్వ పథకాలు కలిగి ఉండటం వంటి విషయాలపై సమాచారం అందించి, నైపుణ్యాలు పెంపొందించే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా లీలావతి, భాస్కరరావు, అప్పారావు మాట్లాడుతూ మత్తుపదార్థాలకు చాలామంది బానిసలై జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, మత్తు పదార్థాలకు దూరంగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని వివరించారు. ప్రభుత్వాలు ఎస్‌టి విద్యార్థులకు ఉద్యోగ నియమకాల్లో ప్రాధాన్యత ఇస్తున్నారని, పాఠశాలకు పంపించి, చదివించి మంచి ఉద్యోగాల్లో చేరేటట్లు చూడటం ద్వారా ఆర్థికంగా, రాజకీయంగా ఎదుగుతారని తెలిపారు. అనంతరం ప్రభుత్వ బీమా పథకాలపై అవగాహన కల్పించారు. కాలనీలో తమ సంస్థ తరపున ఉచితంగా ఏర్పాటు చేసిన ట్యూషన్‌కు పిల్లలందరినీ ప్రతిరోజూ పంపించాలని లీలావతి కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్‌టి కాలనీ వాసులు అమ్మాజీ, పోలమ్మ, నాగమణి, రాజు, యేసు పాల్గొన్నారు.